ధార్మిక మండలి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి
Published Sat, May 20 2017 12:17 AM | Last Updated on Tue, Sep 5 2017 11:31 AM
రమణయ్యపేట (కాకినాడ రూరల్):
దేవాలయాల భూములు, ఆస్తుల పరిరక్షణ కోసం ధార్మిక పరిషత్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని శ్రీపీఠం స్వామిజీ స్వామి పరిపూర్ణానంద డిమాండ్ చేశారు. శుక్రవారం కాకినాడ రూరల్ రమణయ్యపేట శ్రీపీఠంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎండోమెంట్ భూముల పరిరక్షణకు బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన చట్టాలకు పాలకులు కొత్త భాష్యం చెబుతున్నారని ఆరోపించారు. ఎండోమెంట్ ఆస్తుల సంరక్షణకు «రిటైర్డు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ల ఆధ్వర్యంలో ధార్మిక çమండలి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు.« ధర్మకర్తల మండళ్లు కాస్తా రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చేశారని విమర్శించారు. ఏపీ, తెలంగాణలో 33 వేల దేవాలయాలున్నాయని, ఇందులో 20 వేల దేవాలయాల్లో నిత్యం దీప, ధూప, నైవేద్యాలు జరుగుతున్నాయని, మిగతా 13 వేల దేవాలయాలు మూతపడినట్టు తెలిపారు. మూతపడిన ఆలయాల పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులు సమర్పించే ఆదాయంలో 10 శాతం కామన్ గుడ్ ఫండ్ సీఎంకు వెళుతుందన్నారు. వీటి వినియోగంపై ఆర్డీఏలో సమాచారం కోరినా ఇవ్వడం లేదని ఆరోపించారు. విజయవాడలో సిద్ధార్థ కళాశాలకు ప్రభుత్వం విలువైన భూములు కేటాయించడం దారుణమన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుల ఎంపిక రాజకీయాలకతీతంగా ఆధ్యాత్మికతో పనిచేసేవారికి అవకాశం కల్పించాలన్నారు. మక్కా, జెరూసలేం యాత్రలకు వెళ్లే భక్తులకు రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం హిందువులకు రాయితీలు ఇవ్వకపోగా, సర్‌చార్జీలు, టోల్‌గేట్ చార్జీలు వసూలు చేస్తుందని ఆరోపించారు. దేవాలయాలు, పండుగలు నిర్వహించేటప్పుడు దేవుని ప్రచారం చేసే ఫ్లెక్సీల కన్నా పాలకమండలి సభ్యులు, రాజకీయనేతల ఫ్లెక్సీలు అధికంగా కనిపిస్తున్నాయని వాపోయారు. ఈ ఖర్చును భక్తులు హుండీలో సమర్పించిన నిధుల నుంచి వినియోగంచడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement