కప్పట్రాళ్ల అభివృద్ధిలో 'తానా'
– చైతన్య స్రవంతి పేరుతో డిసెంబరు 23, 24న అభివృద్ధి కార్యక్రమాలు
కర్నూలు: కప్పట్రాళ్ల గ్రామాభివృద్ధికి తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ముందుకు వచ్చిందని ఎస్పీ ఆకె రవికృష్ణ తెలిపారు. బుధవారం కర్నూలులో ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. చైతన్య స్రవంతి పేరుతో గ్రామంలో డిసెంబరు 23, 24 తేదీల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు తానా సభ్యులు కార్యచరణను రూపొందించారని వివరించారు. తానా జాయింట్ కార్యదర్శి రవి పొట్లూరి సొంత నిధులతో కప్పట్రాళ్ల గ్రామంలో డిసెంబరు 23న ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహిస్తారన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరికి ఈ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని, అలాగే గ్రామంలోని ప్రతి విద్యార్థికి హైపటైటిస్–బి వ్యాక్సిన్‌ను వేస్తారన్నారు. డిసెంబరు 24న కప్పట్రాళ్ల జడ్పీ హైస్కూలులో బ్రీడ్స్ సొసైటీ లైబ్రరీని ప్రారంబిస్తామన్నారు. అలాగే జెడ్పీ హైస్కూలులో డిజిటల్ క్లాస్‌రూములను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పురుగు మందుల పిచికారీ సమయంలో అవసరమైన ప్రొటెక్షన్ కిట్స్‌ను రైతులకు పంపిణీ చేయన్నుట్లు చెప్పారు. తానా జాయింట్ కార్యదర్శి రవి పొట్లూరితో పాటు తానా అధ్యక్షులు జంపాల చౌదరి, తానా కార్యక్రమాల సమన్వయకర్త ముప్పా రాజశేఖర్ (కర్నూలు), వేమన సతీష్, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధి (అమెరికాలో) కోమటి జయరామ్, తానా ఫౌండేషన్ చైర్మెన్ గోగినేని శ్రీనివాస్, ఫౌండేషన్ ట్రస్టీ తాళ్లూరి జయశేఖర్ తదితరులు చైతన్య స్రవంతి కార్యక్రమాల్లో పాల్గొంటారు.