లక్ష్యాలను పూర్తిచేసే వరకు సెలవుల్లేవ్‌ | targets not reached.. no leaves | Sakshi
Sakshi News home page

లక్ష్యాలను పూర్తిచేసే వరకు సెలవుల్లేవ్‌

Published Thu, Feb 9 2017 1:48 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

targets not reached.. no leaves

ఏలూరు (మెట్రో) : నిర్దేశించిన లక్ష్యాలను అధికారులు పూర్తిచేసే వరకూ జిల్లాలో ఏ ఒక్కరికీ సెలవుల్లేవని కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో ప్రాధాన్యతా రంగాల అధికారులతో కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు మరో 50 రోజుల్లో పూర్తికానున్న నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వివిధ పథకాలలో నిర్దేశించిన లక్ష్యాలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి జూన్‌ మధ్య కాలంలో బడ్జెట్‌ రాలేదనే సాకుతో ఎలాగూ పనులు చేయరని, ఈ నేపథ్యంలో ఉన్న బడ్జెట్‌తో ఈ 50 రోజులూ పనులు పూర్తి చేయాలన్నారు. ప్రతి ఉద్యాన పంటకూ బిందుసేద్యం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసరావును ఆదేశించారు. వ్యవసాయం, పశుసంవర్ధక, మత్స్యశాఖ, ఉద్యానవనం వంటి శాఖల అధికారులు రైతులతో ఎఫ్‌పీవోలు ఏర్పాటు చేసి రైతులు పండించిన పంటలు వారే నేరుగా అమ్ముకునే వీలు కల్పించాలన్నారు. రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారికి అవసరమైన సలహాలు, సూచనలు అందించాలన్నారు. రైతులకు రుణాలు, ఉపకరణాలు వారి అర్హత మేరకు అందించాలన్నారు. ఈ పంపిణీలో ఏమైనా అవకతవకలు చోటు చేసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులు ఫామ్‌పాండ్స్‌ తవ్వించి భూగర్భజలాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతపురం, కర్నూలు, ప్రకాశం, కడప వంటి జిల్లాల్లో ప్రభుత్వం నిరే్ధశించిన లక్ష్యాలకన్నా బిందుసేద్యం పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, ఈ జిల్లాల్లో వారంవారం సమీక్షలు నిర్వహిస్తున్నా బిందు సేద్యం లక్ష్యాలను ఎందుకు పూర్తిచేయలేకపోతున్నారని కలెక్టర్‌ ప్రశ్నించారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ పులిపాటి కోటేశ్వరరావు, సీపీవో బాలకృష్ణ, వ్యవసాయశాఖ జేడీ సాయిలక్షీ్మశ్వరి, మార్కెటింగ్‌ డీఎం నాగమల్లిక పాల్గొన్నారు. 
 
667 సోలార్‌ పంపుసెట్లు మంజూరు
ఎన్టీఆర్‌ జలసిరి పథకం ఫేజ్‌–2లో భాగంగా జిల్లాలో 667 సోలార్‌ పంపుసెట్లు బ్లాక్‌లు మంజూరయ్యాయని కలెక్టర్‌ భాస్కర్‌ చెప్పారు. వీటిలో 351 బ్లాక్‌లలో రైతులకు బోర్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. బుధవారం జలసిరి, నీరు–చెట్టు పథకాలకు సంబంధించిన పనులపై అధికారులతో సమీక్షించారు. ఎన్టీఆర్‌ జలసిరి ఫేజ్‌–2లో నూతన విధానం ద్వారా ఇప్పటివరకూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ రైతుల నుంచి రూ.5 వేలతో సోలార్‌ పంపుసెట్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ నూతన నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ రైతులు రూ.6 వేలు, ఓసీ, బీసీ రైతులు రూ.25 వేలు విరాళం ద్వారా వెంటనే చెల్లించిన వారికి సోలార్‌ పంపుసెట్లు ఇవ్వనున్నట్టు కలెక్టర్‌ చెప్పారు. డీఆర్వో హైమావతి, డ్వామా పీడీ ఎం.వెంకటరమణ, ఏపీడీ సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు.
 
గడువులోగా సీసీ రోడ్లు నిర్మించాలి
జిల్లాలో పంచాయతీరాజ్‌ నిధులతో నిర్మించే సీసీ రహదారుల నిర్మాణ పనులు 
నిర్దేశించిన లక్ష్యం ప్రకారం మార్చి 20 నాటికి పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్‌ ఏఈలను కలెక్టర్‌ భాస్కర్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్‌ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో మండల సమాఖ్య, అంగన్‌వాడీ భవనాల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. పునాది దశలో ఉన్న నిర్మాణాలు వారం రోజుల్లో పూర్తి చేయాలని, ప్రారంభించని పనులు వెంటనే ప్రారంభించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఉపాధిహామీ పథకం ద్వారా నిర్మించాల్సిన సీసీ రోడ్లు త్వరగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో సీసీ రోడ్లు నిర్మాణ పనులు కాంట్రాక్టర్లు ప్రారంభించకుంటే నోటీసులిచ్చి బ్లాక్‌లిస్టులో పెట్టాలని ఆదేశించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement