లక్ష్యాలను పూర్తిచేసే వరకు సెలవుల్లేవ్
Published Thu, Feb 9 2017 1:52 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
ఏలూరు (మెట్రో) : నిర్దేశించిన లక్ష్యాలను అధికారులు పూర్తిచేసే వరకూ జిల్లాలో ఏ ఒక్కరికీ సెలవుల్లేవని కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో ప్రాధాన్యతా రంగాల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు మరో 50 రోజుల్లో పూర్తికానున్న నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వివిధ పథకాలలో నిర్దేశించిన లక్ష్యాలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జూన్ మధ్య కాలంలో బడ్జెట్ రాలేదనే సాకుతో ఎలాగూ పనులు చేయరని, ఈ నేపథ్యంలో ఉన్న బడ్జెట్‌తో ఈ 50 రోజులూ పనులు పూర్తి చేయాలన్నారు. ప్రతి ఉద్యాన పంటకూ బిందుసేద్యం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసరావును ఆదేశించారు. వ్యవసాయం, పశుసంవర్ధక, మత్స్యశాఖ, ఉద్యానవనం వంటి శాఖల అధికారులు రైతులతో ఎఫ్‌పీవోలు ఏర్పాటు చేసి రైతులు పండించిన పంటలు వారే నేరుగా అమ్ముకునే వీలు కల్పించాలన్నారు. రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారికి అవసరమైన సలహాలు, సూచనలు అందించాలన్నారు. రైతులకు రుణాలు, ఉపకరణాలు వారి అర్హత మేరకు అందించాలన్నారు. ఈ పంపిణీలో ఏమైనా అవకతవకలు చోటు చేసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులు ఫామ్‌పాండ్స్ తవ్వించి భూగర్భజలాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతపురం, కర్నూలు, ప్రకాశం, కడప వంటి జిల్లాల్లో ప్రభుత్వం నిరే్ధశించిన లక్ష్యాలకన్నా బిందుసేద్యం పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, ఈ జిల్లాల్లో వారంవారం సమీక్షలు నిర్వహిస్తున్నా బిందు సేద్యం లక్ష్యాలను ఎందుకు పూర్తిచేయలేకపోతున్నారని కలెక్టర్ ప్రశ్నించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు, సీపీవో బాలకృష్ణ, వ్యవసాయశాఖ జేడీ సాయిలక్షీ్మశ్వరి, మార్కెటింగ్ డీఎం నాగమల్లిక పాల్గొన్నారు.
667 సోలార్ పంపుసెట్లు మంజూరు
ఎన్టీఆర్ జలసిరి పథకం ఫేజ్–2లో భాగంగా జిల్లాలో 667 సోలార్ పంపుసెట్లు బ్లాక్‌లు మంజూరయ్యాయని కలెక్టర్ భాస్కర్ చెప్పారు. వీటిలో 351 బ్లాక్‌లలో రైతులకు బోర్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. బుధవారం జలసిరి, నీరు–చెట్టు పథకాలకు సంబంధించిన పనులపై అధికారులతో సమీక్షించారు. ఎన్టీఆర్ జలసిరి ఫేజ్–2లో నూతన విధానం ద్వారా ఇప్పటివరకూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ రైతుల నుంచి రూ.5 వేలతో సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ నూతన నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ రైతులు రూ.6 వేలు, ఓసీ, బీసీ రైతులు రూ.25 వేలు విరాళం ద్వారా వెంటనే చెల్లించిన వారికి సోలార్ పంపుసెట్లు ఇవ్వనున్నట్టు కలెక్టర్ చెప్పారు. డీఆర్వో హైమావతి, డ్వామా పీడీ ఎం.వెంకటరమణ, ఏపీడీ సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు.
గడువులోగా సీసీ రోడ్లు నిర్మించాలి
జిల్లాలో పంచాయతీరాజ్ నిధులతో నిర్మించే సీసీ రహదారుల నిర్మాణ పనులు
నిర్దేశించిన లక్ష్యం ప్రకారం మార్చి 20 నాటికి పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ ఏఈలను కలెక్టర్ భాస్కర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో మండల సమాఖ్య, అంగన్‌వాడీ భవనాల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. పునాది దశలో ఉన్న నిర్మాణాలు వారం రోజుల్లో పూర్తి చేయాలని, ప్రారంభించని పనులు వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. ఉపాధిహామీ పథకం ద్వారా నిర్మించాల్సిన సీసీ రోడ్లు త్వరగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో సీసీ రోడ్లు నిర్మాణ పనులు కాంట్రాక్టర్లు ప్రారంభించకుంటే నోటీసులిచ్చి బ్లాక్‌లిస్టులో పెట్టాలని ఆదేశించారు.
నిబంధనలకు తూట్లు పొడిస్తే కఠిన చర్యలు
జిల్లాలో పంటలు పండుతున్నా వ్యవసాయానికి పనికిరాదంటూ చేపల చెరువులకు అనుమతులు ఇచ్చే అధికారుల ఉద్యోగాలు పోతాయని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ హెచ్చరించారు. కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన చేపల చెరువుల అనుమతుల కమిటీ అధికారులతో కలెక్టర్ భాస్కర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో చేపల చెరువుల అనుమతుల కోసం వచ్చే దరఖాస్తులను పరిశీలించి ఆ భూమి వ్యవసాయానికి పనికి వస్తుందీ, లేనిదీ చూడాలని, భూసార పరీక్షలు నిర్వహించి పనికిరాదని తేలితే అనుమతులను మంజూరు చేయాలన్నారు. చేపల చెరువుల ఏర్పాటులో ఇన్, అవుట్ డ్రెయిన్లు సక్రమంగా ఉన్నదీ, లేనిదీ ఇరిగేషన్ అధికారులు పరిశీలించి అవి సక్రమంగా ఉంటేనే అనుమతులు మంజూరు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఫిషరీస్ డీడీ యాకూబ్ బాషా, వ్యవసాయశాఖ జేడీ వై.సాయిలక్షీ్మశ్వరి, గ్రౌండ్ వాటర్ డీడీ రంగారావు పాల్గొన్నారు.
పరిశ్రమలు నెలకొల్పేలా చర్యలు తీసుకోండి
జిల్లాలో అనుమతులు మంజూరు చేసిన పరిశ్రమలు త్వరితగతిన నెలకొల్పేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.భాస్కర్ ఆదేశించారు. పరిశ్రమల స్థాపనపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగిల్ డెస్క్ విధానంలో త్వరితగతిన పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేస్తున్నప్పటికీ ఇంతవరకూ జిల్లాలో ఆశించినస్థాయిలో పరిశ్రమలు ఎందుకు నెలకొల్పడం లేదని అధికారులను ప్రశ్నించారు. సాధ్యమైనంత వరకూ త్వరితగతిన జిల్లాలో పరిశ్రమలు స్థాపించేలా అధికారులు కృషి చేయాలన్నారు. దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి వీలైతే అనుతులు ఇవ్వాలని, లేకుంటే ఏ కారణం చేత తిరస్కరిస్తున్నారో తెలిపి తిరస్కరించాలని ఆదేశించారు. జిల్లాలో ఇంకా 38 పరిశ్రమల అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలన్నారు. రైల్వే ట్రాక్‌ల వెంబడి చేసే నిర్మాణాలకు రైల్వే ప్రాపర్టీ హద్దు నుంచి 30 మీటర్లు విడిచి నిర్మాణాలు చేపట్టాలనే నిబంధన ఉందని అధికారులు చెప్పడంపై కలెక్టర్ స్పందిస్తూ నష్టపోయిన సొంత భూమికి నష్టపరిహారం ఎవరిస్తారని ప్రశ్నించారు. దీనిపై ఒక నివేదిక తయారు చేయాలని చెప్పారు.
Advertisement