
సీన్ మారింది
పురంలో టీడీపీ అసమ్మతి నాయకుల సీన్ తెల్లవారేసరికి మారిపోయింది. నిన్నటి దాకా ‘‘పీఏ శేఖర్‌ను హిందూపురం నుంచి తరిమేద్దాం.
- ఎమ్మెల్యే ఇంట్లో టీడీపీ నాయకుల సమావేశం
- పీఏ శేఖర్ ప్రస్తావన లేకుండానే ముగించిన వైనం
హిందూపురం అర్బన్ : పురంలో టీడీపీ అసమ్మతి నాయకుల సీన్ తెల్లవారేసరికి మారిపోయింది. నిన్నటి దాకా ‘‘పీఏ శేఖర్‌ను హిందూపురం నుంచి తరిమేద్దాం.. ఆయన ఉంటే మేం పార్టీకి రాజీనామా చేస్తాం..’’ అని పలికిన వారంతా తాజాగా శుక్రవారం ‘‘ఎమ్మెల్యే బాలకృష్ణ వెంటే ఉందాం. ఆయన ఎవరికి పెత్తనమిచ్చినా.. వారి వెంట నడుద్దాం.’’ అని పేర్కొన్నారు. బాలయ్య పీఏ అనుకూల వర్గం వారు శుక్రవారం ఎమ్మెల్యే ఇంట్లో సమావేశమయ్యారు. ఇన్నాళ్లూ అసమ్మతి వర్గంలో ఉన్న బీసీ కార్పొరేషన్ చైర్మన్ రంగనాయకులు, మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మి, వైస్‌చైర్మన్ రాము, ఆస్పత్రి కమిటీ చైర్మన్ వెంకటస్వామి, మైనార్టీ కార్పొరేషన్ సభ్యులు షఫీ సమావేశానికి హాజరు కావడంతో కంగుతినడం కార్యకర్తల వంతైంది.
ఎమ్మెల్యే పీఏ శేఖర్‌ను హిందూపురం నుంచి సాగనంపాలనే డిమాండ్‌తో ఈనెల 5న అసమ్మతి నాయకులు చిలమత్తూరులో భారీఎత్తున సమావేశం పెట్టేందుకు మంతనాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సమావేశం జరిగితే పార్టీ ప్రతిష్ట దెబ్బ తింటుందని భావించిన ఎమ్మెల్యే పీఏ శేఖర్ వర్గీయులు సమావేశానికి అడ్డుకట్ట వేసేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే బాలకృష్ణతో కొందరు ముఖ్యనాయకులకు ఫోన్ కూడా చేయించారు. దీంతో గురువారం రాత్రి అసమ్మతి వర్గంలో ఉన్న నాయకులు శుక్రవారం ఉదయానికే ఎమ్మెల్యే ఇంట్లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. జెడ్పీటీసీ సభ్యుడు ఆదినారాయణ మాట్లాడుతూ బాలకృష్ణపై తప్పుడు ప్రచారం చేస్తే చంపేస్తామన్నారు. ఇదంతా చూసిన కార్యకర్తలు ఇదేం గోలరా.. బాబూ అని చర్చించుకోవడం విశేషం. అయితే సమావేశంలో ఎక్కడా పీఏ శేఖర్ ప్రస్తావన రాలేదు. ఉన్నంతసేపు బాలకృష్ణపై స్వామిభక్తి చాటుకున్నారు.