బుక్కపట్నం : కొన్నాళ్లుగా పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య తలెత్తిన విభేదాలు మరింత ముదిరి పాకానా పడ్డాయి. నగర పంచాయతీ చైర్మన్‌గా పదవీ కాలం ఒప్పందం ప్రకారం పూర్తయినా పీసీ గంగన్న పదవి నుంచి దిగిపోకపోవటంతో ప్రత్యర్థులు మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి అండతో గంగన్నపై వేటుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. గతంలో అనేకసార్లు అధిష్టానం ముందు పంచాయితీ జరిగినా పదవి నుంచి దిగేందుకు గంగన్న ససేమీరా అనటంతో ప్రత్యర్థులు ఈ సారి ఏకంగా అమరావతిలోనే ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి లోకేశ్‌ను నేరుగా కలసి అప్పట్లో ఒప్పందం చేసుకున్న అగ్రిమెంట్ పత్రాలు సమర్పించారు.
ఒప్పందం ప్రకారం గంగన్న రెండున్నరేళ్లు బెస్త చలపతి రెండున్నరేళ్లు ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందాన్ని గంగన్న ఉల్లంఘించాడని బెస్త చలపతి వర్గం గట్టిగా వినిపించింది. ఒక వేళ పీసీ పదవి నుంచి దిగక పోతే పార్టీ నుంచి బహిష్కరించి సాగనంపేలా పావులు కదిపారు. ఈ సారీ ఎలాగైనా గంగన్నను చైర్మన్ పదవి నుంచి దింపేందుకు మాజీ మంత్రి పల్లె గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. గంగన్న పదవికి రాజీనామా చేస్తాడా లేక ఎదురు తిరుగుతాడా అనే విషయం రానున్న అతి కొద్ది రోజుల్లో తేలనుంది. ఈ విభేదాలు ఇలాగే కొనసాగితే గంగన్న పార్టీలో ఉంటారా లేదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. టీడీపీలో ఉన్న విభేదాల వల్ల నగర పంచాయతీ అభివృద్ధి కుంటు పడిందని పలువురు పేర్కొంటున్నారు.
పుట్టపర్తి టీడీపీలో ముదిరిన విభేదాలు
Published Wed, May 3 2017 11:38 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
Advertisement