బడి ఎన్నికల్లో పచ్చ రుబాబు
ఎస్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీ నేతల దౌర్జన్యం
85 స్కూళ్లలో మళ్లీ వాయిదా
అనంతపురం ఎడ్యుకేషన్ : స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు బరి తెగించారు. విద్యా శాఖ అధికారులను, ప్రధానోపాధ్యాయులను సైతం బెదిరిస్తున్నారు. తమ వాళ్లనే గెలిపించాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. ‘మా పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి మా వాళ్లనే ఎస్‌ఎంసీ చైర్మన్లుగా నియమించాలి. మా వారు గెలిచేందుకు అవకాశం లేకపోతే ఏదో సాకు చూపి వాయిదా వేయండి..’ అంటూ మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులను ఆదేశిస్తున్నారు. ఫలితంగా గతంలో పలు స్కూళ్లలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. అలాంటి చోట్ల సోమవారం మళ్లీ నిర్వహించారు. ఇప్పుడూ అదే సీన్ పునరావృతమైంది.
జిల్లాలో మొత్తం 3,866 పాఠశాలలు ఉన్నాయి. ఈ నెల ఒకటిన 3,670 పాఠశాలల్లో ఎన్నికలు నిర్వహించారు. అప్పుడు 196 చోట్ల వాయిదా పడ్డాయి. వీటిలో సోమవారం 111 చోట్ల తిరిగి నిర్వహించారు. వీటిలో ఎక్కువగా తమ ప్రత్యర్థులు చైర్మన్లుగా గెలుస్తారనే ఉద్దేశంతో 85 చోట్ల ఎన్నికలు జరగకుండా అధికార పార్టీ నేతలు వాయిదా వేయించారు. లేపాక్షి మండలం మైదుగోళం పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులే ఎక్కువ మంది ఉన్నారు. దీంతో అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్య ప్రజాప్రతినిధి ఆదేశాలతో కిందిస్థాయి కార్యకర్తలు దౌర్జన్యానికి దిగి ఎన్నిక వాయిదా వేయించారు. చెన్నేకొత్తపల్లి మండలం గంగినేపల్లిలోనూ ఇదే పరిస్థితి. ఆత్మకూరు మండలం బి.యాలేరులో కోరం లేక వాయిదా పడింది.