సర్కారు సెల్ఫ్‌గోల్
సర్కారు సెల్ఫ్‌గోల్
Published Wed, Dec 23 2015 10:47 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
హైదరాబాద్: కాల్‌మనీ- సెక్స్ రాకెట్ వ్యవహారంలో ప్రభుత్వం శాసనసభ లోపల, వెలుపల సెల్ఫ్‌గోల్ వేసుకుందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. అధికార పార్టీతో సంబంధమున్న కొద్దిమందిని కాపాడేందుకు రాష్ట్రం అంతటా వడ్డీ వ్యాపారులపై దాడులు చేయించటం వల్ల పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని ఐదు రోజుల పాటు జరిగిన శాసనసభ శీతాకాల సమావేశాలకు హాజరైన ఎమ్మెల్యేలు, పలువురు నేతల చర్చల్లో వెల్లడైంది. శాసనసభ సమావేశాలకు హాజరైన ఎమ్మెల్యేల వెంట పలువురు నేతలు, అనుచరులు కూడా హైదరాబాద్‌కు వచ్చారు.
అసెంబ్లీ వాయిదా పడినప్పుడు, ఇతరత్రా సందర్భాల్లో వారంతా ఇదే అంశంపై ప్రధానంగా చర్చించుకున్నారు. విజయవాడలో కాల్‌మనీ వ్యవహారం బయటకు వచ్చింది. ఎక్కువ వడ్డీకి రుణాలివ్వడం, అప్పు తీర్చలేని వారిని, తీర్చేందుకు గడువు కోరిన వారిని బెదిరించటం, మహిళలను భయపెట్టి వ్యభిచార కూపంలోకి దింపడం వంటి హేయమైన చర్యలకు కాల్‌మనీ ముఠా పాల్పడింది. మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతల అండదండలతోనే ఈ దందా కొనసాగిందని, ముఖ్యమంత్రి ఆశీస్సులు సైతం ఉన్నాయని వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిగితే పార్టీ పరువు పోవటంతో పాటు రాజకీయంగా నష్టం జరుగుతుందని భావించిన చంద్రబాబు.. వాస్తవాలు వెలుగులోకి రాకుండా చూడటంతో పాటు, మనీ-సెక్స్ రాకెట్ ఏదో సాదాసీదా వ్యవహారమన్నట్టుగా రాష్ట్రవ్యాప్తంగా వడ్డీ వ్యాపారులపై దాడులు నిర్వహింపజేశారు. ఈ వ్యాపారంలో ప్రతిపక్ష పార్టీల నేతలే ఎక్కువగా ఉన్నారంటూ పోలీసులతో నివేదికలు ఇప్పించారు. అయితే దీనివల్ల పార్టీ కిందిస్థాయిలో అభాసుపాలైందని తెలుగుదేశం నేతలే అంగీకరిస్తున్నారు.
చంద్రబాబుకు నిజంగా ఈ విషయంలో చిత్తశుద్ధి ఉంటే విజయవాడ మనీ-సెక్స్ రాకెట్‌లో పార్టీ నేతలు ఉన్నప్పటికీ.. అరాచకాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు విచారణను కూడా అక్కడకే పరిమితం చేసి ఉండేవారన్న అభిప్రాయం వ్యక్తమైంది. సమస్యపై చిత్తశుద్ధి లేకపోవటం వల్లే తొలిరోజు అసెంబ్లీలో ఈ అంశం చర్చకు రాకుండా చేశారని నేతలు వ్యాఖ్యానించారు. పైగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను.. తనను దూషించిందనే సాకుతో సభ నుంచి ఏడాదిపాటు సస్పెండ్ చేయటం వంటి తీవ్రమైన చర్య తీసుకోవడం కూడా తమ డొల్లతనాన్ని బైట పెట్టిందని టీడీపీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
సభలో ప్రతిపక్షం లేకపోతే ఎలా..?
పెపైచ్చు మంగళవారం శాసనసభలో ప్రతిపక్షం లేనప్పటికీ రోజాపై విమర్శలకే సమయం కేటాయించటం, పలువురు ఎమ్మెల్యేలతో రోజాపై చర్య తీసుకోవాలని ఫిర్యాదు చేయించటం ఆ అభిప్రాయాన్ని బలపరుస్తోందని ఆ నాయకుడు వ్యాఖ్యానించారు. సభలో ప్రతిపక్షాలకు సమాధానం ఇవ్వడం ద్వారా ప్రభుత్వం చేసే కార్యకలాపాలను ప్రజలకు వివరించేందుకు అవకాశం ఉండేదని, ప్రతిపక్షం లేకుండా సభను నడిపించడం చూస్తే.. టీ డీఎల్పీ సమావేశం నిర్వహించినట్లుగా ఉందని ఆ పార్టీ శాసనసభ్యుడు ఒకరు వ్యాఖ్యానించారు.
Advertisement