అడ్డంగా దొరికారు..గుట్టుగా తప్పించారు!
– పేకాట కేసు తారుమారు
– పట్టుబడింది తెలుగు తమ్ముళ్లు
– అరెస్టులో చూపింది అనామకులను
– పోలీసులపై టీడీపీ నేత ఒత్తిళ్లు
– నంద్యాలలో ఘటన
నంద్యాల: పేకాడుతూ అడ్డంగా దొరికిన టీడీపీ నేత అనుచరులను కేసు నుంచి పోలీసులు గుట్టుగా తప్పించారు. ఎలాంటి రాజకీయ అండలేని అనామకులపై కేసు నమోదు చేసి.. మీడియా ఎదుట వారిని హాజరు పరిచారు. ఈ ఘటన బుధవారం నంద్యాల పట్టణంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌బీఐ కాలనీలోని ఎస్‌ఎస్ అపార్టుమెంట్‌లో ఉద్యోగులు, వ్యాపారులు ఉన్నారు. అపార్టుమెంట్ సంస్కతిలో ఉన్న లోపాలను టీడీపీ నేత అనుచరులు అనుకూలంగా మార్చుకున్నారు. ప్లాట్‌నెం.402లో పేకాట స్థావరాన్ని నెలకొల్పారు. ఇందులో టీడీపీ నేత వర్గానికి చెందిన ప్రముఖ నాయకుడు కీలక పాత్ర వహించినట్లు తెలుస్తోంది. ఇతనితో పాటు మరికొందరు టీడీపీ నాయకులు, వ్యాపారులు ప్రతి రోజూ లక్షల రూపాయలతో గంటల తరబడి పేకాడుతున్నట్లు తెలిసింది. కొద్ది రోజుల క్రితం ఈ సమాచారం పోలీసులకు అందడంతో నిఘా వేశారు.
దాడి ఇలా...
మంగళవారం రాత్రి టూటౌన్ ఇన్‌చార్జి సీఐ మురళీధర్‌రెడ్డి, సిబ్బందితో పేకాట స్థావరంపై దాడి చేశారు. టీడీపీ నేతకు చెందిన ప్రముఖ అనుచరుడు ఉండటంతో పోలీసులు షాక్ తిన్నారు. వెంటనే మూడో కంట పడకుండా వెళ్లిపోమ్మని తప్పించినట్లు సమాచారం. తర్వాత టీడీపీ నేత వర్గానికి చెందిన ప్రముఖ నాయకుడు, ఇసుక వ్యాపారి, మాజీ సొసైటీ అధ్యక్షుడుతో పాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వీరిని టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే రాత్రి రాత్రికే సీన్ మారింది. పేకాటలో చిక్కిన తెలుగు తమ్ముళ్లు టీడీపీ నేతకు ఫోన్ చేయడం.. వెంటనే ఆయన పోలీసులపై ఒత్తిడి తేవడం, పోలీసులు వారిని తప్పించి సగర్వంగా బయటకు పంపడం నిమిషాల్లో జరిగిపోయింది. తెలుగు తమ్ముళ్లను తప్పించిన పోలీసులు ఎలాంటి రాజకీయ పలుకుబడి లేని వ్యక్తులపై కేసు నమోదు చేశారు.
ఏడుగురి అరెస్ట్...
ఎస్‌ఎస్ అపార్టుమెంట్‌లో పేకాట స్థావరంపై దాడి చేసి షేక్ జాకీర్ రహమాన్, దూదేకుల మహమ్మద్, పాల నరసింహారెడ్డి, సాలెపల్లి నారాయణరెడ్డి, పగిడాల సుబ్బారావు, పుట్ట నాగరాజు, కె.శివరాజులను అరెస్ట్ చేశామని టూటౌన్ ఇన్‌చార్జి సీఐ మురళీధర్‌రెడ్డి తెలిపారు. ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వీరి నుంచి రూ. 2.77లక్షల నగదు, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. సమావేశంలో వన్‌టౌన్ సీఐ ప్రతాపరెడ్డి, టూటౌన్ ఎస్‌ఐ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. అయితే టీడీపీ నాయకులను ఎవరినీ అరెస్ట్ చేయలేదని మురళీధర్‌రెడ్డి తెలిపారు.