బడాయి మాటల బడేటి
ముద్రగడపై చిందులు
‘సాక్షి’పై అవాకులు చెవాకులు
ఫలితం దక్కక నవ్వులపాలు
ఏలూరు : ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఎంపీలు, టీడీపీ సీనియర్ నేతల సమక్షంలో గొప్పలకు పోయిన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి కార్యకర్తల ఎదుటే నవ్వుల పాలయ్యారు. కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంపై విమర్శలు చేయటం ద్వారా ముఖ్యమంత్రి మెప్పు పొందాలన్న కోరిక సఫలం కాకపోగా, తన పరపతిని ఉపయోగించి కొందరిని వేదికపైకి రప్పించే ప్రయత్నం చేసి భంగపడ్డారు.
చివరకు స్థాయి పెంచుకోవాలని ‘సాక్షి’పై అవాకులూ చెవాకులూ పేలటం మొదలు పెట్టేసరికి ఆయన చెప్పేది అర్థం కాక అందరూ తలలు పట్టుకొన్నారు. గత రెండు రోజులుగా ‘సాక్షి’ మీడియాను టార్గెట్ చేసి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న బుజ్జి గురువారం సీఎం సభావేదికపై మరోసారి రెచ్చిపోయారు. ‘సాక్షి’ దినపత్రికలో ఇష్టమొచ్చినట్టు రాస్తున్నారని పదేపదే అక్కసు వెళ్లగక్కిన ఆయన ఏం రాశారు, ఏ అవాస్తవం ప్రచురించారో మాత్రం చెప్పలేకపోయారు. ఏదో ఒకరోజు ప్రజా విప్లవం వస్తుందని, దాన్ని ఎవరూ తట్టుకోలేరని, విప్లవాలు వచ్చినప్పుడు ఎన్నో కూలిపోయాయని.. ఇలా అర్థంపర్ధం లేకుండా మాట్లాడారు. సంబంధం లేని బడేటి మాటలతో మంత్రులతో పాటు అక్కడున్న టీడీపీ కార్యకర్తలూ తలలు పట్టుకున్నారు. ముఖ్యమంత్రి మెప్పుకోసమే బడేటి అలా ‘సాక్షిై’పె ఆవేశంతో ఊగిపోయారని టీడీపీ వర్గాలే వ్యాఖ్యానించాయి.
బాబు అభినందనకు నోచుకోని బడేటి
సీఎం చంద్రబాబు ఏ నియోజకవర్గంలో బహిరంగ సభ జరిగితే ఆ సెగ్మెంట్ ఎమ్మెల్యేను అభినందిస్తుంటారు. దెందులూరులో జరిగినప్పుడు చింతమనేని ప్రభాకర్‌ను, ఉంగుటూరు పరిధిలో పర్యటించినప్పుడు గన్ని వీరాంజనేయులును, కలవపూడిలో సభ జరిగితే ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజును ప్రశంసించారు. గురువారం ఏలూరులో జరిగిన కాపు మేళా సభలో గానీ, జనవరి 1వ తేదీన ఏలూరు ప్రభుత్వాసుపత్రి ఆవరణలో జరిగిన బహిరంగసభలో గానీ ముఖ్యమంత్రి నుంచి ప్రశంస రాలేదు కదా కనీసం బడేటి పేరును కూడా సీఎం ప్రస్తావించలేదు. దీంతో ఎలాగైనా చంద్రబాబు మెప్పు పొందాలని తెగ తాపత్రయపడిన ఆయన చివరకు నవ్వుల పాలయ్యారు. ఆయన అర్థంపర్ధం లేని మాటలతో చంద్రబాబు సైతం అసహనం వ్యక్తం చేశారు.
బడేటి మాటకు అడ్డొచ్చిన సీఎం
గురువారం నాటి సభలో సీఎం మాట్లాడేందుకు మైక్ వద్దకు రాగా, అదే సమయంలో వేదిక మీదకు వచ్చేందుకు వివిధ ప్రజాసంఘాల నేతలు ప్రయత్నించారు. పోలీసు అధికారులు వారిని అడ్డుకోగా, బడేటి మైక్ తీసుకుని.. ‘ఎస్పీ గారూ వాళ్లను పైకి పంపించండి’ అని ఒకటికి రెండుసార్లు విజ్ఞప్తి చేశారు. ఫలితం లేకపోవడంతో ‘పోలీసులూ.. నేను చెబుతున్నా కదా. పంపించండి’ అని కాస్త గట్టిగా చెప్పారు. వెంటనే చంద్రబాబు మైక్ తీసుకుని ‘నేను స్టేజీ దిగేటప్పుడు కలుస్తా. ఇప్పుడొద్దు’ అని అడ్డు చెప్పారు.