కీచక ఉపాధ్యాయుడిపై కేసు
విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్
♦ అక్బర్‌పేటలో ఘటన
సిద్దిపేట క్రైం: తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుది. అంతటి గొప్ప స్థానానికి కొం దరు ఉపాధ్యాయులు మచ్చ తెస్తున్నారు. వరుస సంఘటనలు విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పి వారి భవిష్యత్తుకు చక్కటి బాట వేయాల్సిన గురువు బరితెగిస్తున్నాడు. మొన్న మెదక్ జిల్లా మిరుదొడ్డి మండ లం అక్బర్‌పేట పాఠశాలలో బాలిక పట్ల ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించి కటకటాల పాలయిన సంఘటన మరువకముందే మళ్లీ సిద్దిపేట పట్టణంలో మరో దారుణం చోటు చేసుకుంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. ఒకప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలను గురువులపై నమ్మకం, గౌరవంతో వారి ఇళ్లలోనే ఉంచి విద్యాబుద్ధులు నేర్పించే వారు. గురువులు కూడా అంతే నమ్మకంతో వారి శిష్యులను సొంత బిడ్డల్లా చూసుకునే వారు. కాలగమనంలో గురువులు కూడా చెడు మార్గం పట్టారు.
ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సిద్దిపేటలోని అక్బర్ పేట బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్ హిందీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న ఫర్వేజ్ అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని (14) పట్ల అసభ్యంగా ప్రవర్తిం చాడు. వెకిలి చేష్టలతో బాలికను ఇబ్బందులకు గురి చేశాడు. దీంతో బాధితురాలు ఇంటికెళ్లి తల్లిదండ్రులకు విషయం వివరించింది. దీంతో బాలిక తండ్రి హుస్సేన్ గురువారం వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ సీఐ సురేందర్‌రెడ్డి చెప్పారు. నిందితుడు ఫర్వేజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ సంఘటనపై విద్యార్థి సం ఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితున్ని కఠినంగా శిక్షించాలని డిమాండు చేస్తున్నారు.