నీటి పొదుపునకు వినూత్న ప్రయోగం
- సాంకేతిక పరిజ్ఞానంతో నీటి సరఫరా
- సుమారు రూ.3 కోట్లతో ప్రయోగం
అనంతపురం సిటీ : కరువు జిల్లాగా ముద్రపడిన అనంతపురం జిల్లాలో నీటి పొదుపునకు వినూత్న ప్రయోగం చేసేందుకు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు సిద్ధమయ్యారు. సాంకేతిక పరిజ్ఞానంతో మొదట జిల్లాలోని పుట్టపర్తి నియోజకవర్గంలో ప్రయోగించేందుకు ఇప్పటికే ప్రణాళిక కూడా సిద్ధం చేసినట్టు సమాచారం. వివరాలు.. ఈ విధానానికి ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయి. ఇప్పటికే ఓ ప్రైవేట్ కంపెనీ సహకారంతో పుట్టపర్తి నియోజకవర్గంలో సర్వే కూడా పూర్తి చేశారు.
వృథాను అరికట్టేందుకే..
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విచ్చలవిడిగా వృథా అవుతున్న నీటిని అరికట్టేందుకు ఈ విధానం చాలా ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. కుళాయిలు సరిగా లేకపోవడం, పైపులై¯Œన్ల లీకేజీలతో ఎక్కువ నీరు నేల అవుతోంది. అలా జరగకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుందని తెలిపారు. నేరుగా ట్యాంకుల కెపాసిటీని ముందుగానే సిస్టమ్‌లో ఫీడ్ చేస్తారు. రోజువారి ట్యాంకుకు ఎంత నీరు సరఫరా చేయాలో కూడా అందులో పొందుపరుస్తారు. దీంతో ట్యాంక్ ఫుల్ కాగానే ఆటోమెటిక్‌గా నీటి సరఫరా ఆగిపోతుంది. ఈ విధానం అమల్లోకి వస్తే నీటి వృథా తగ్గిపోతుందని అధికారులు చెబుతున్నారు.
రూ.3 కోట్ల వ్యయంతో..
పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలో 80 ట్యాంకులు ఉన్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. వీటన్నింటికి ఈ పరిజ్ఞానాన్ని అనుసంధానం చేస్తామన్నారు. సుమారు రూ.3 కోట్లు వ్యయంతో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు వివరించారు.
కంపెనీలతో చర్చలు
పలు కంపెనీల యజమానులను కలెక్టర్ పిలిపించి మాట్లాడినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే విశాఖలో ఓ కంపెనీ నీటిని ఇదే పద్ధతిలో సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ఆ కంపెనీ ఇచ్చిన కొటేషన్‌ను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. రేటు విషయంలో కొంత తేడాలుండటంతో అధికారులు నిర్ణయం తీసుకునేందుకు గడువు తీసుకున్నట్లు పేర్కొన్నారు. త్వరలో కంపెనీలను ఓపెన్ టెండర్‌లకు పిలిచి పనులు అప్పగిస్తామని వివరించారు.