ప్రమాదమా.. హత్యా..!
పెరవలి: పెరవలి మండలం ఖండవల్లి వద్ద జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అం దించారు. పోలీసులు వచ్చి పరిశీలించి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిందని భావిస్తుండగా, మృతుని బంధువులు మాత్రం కొట్టి చంపేశారని ఆరోపిస్తున్నారు. హత్యా లేక ప్రమాదమా అన్నది పోస్టుమార్టం రిపోర్టులో తేలనుంది. వివరాలిలా ఉన్నాయి.. ఖండవల్లి వద్ద జాతీయ రహదారిపై బుధవారం రాత్రి అదే గ్రామానికి చెందిన మానుపాటి రా ముడు (40) అనే వ్యక్తి మృతిచెంది పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే మృతిపై బంధువులు, స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుని శరీరంపై గాయాలను పరిశీలిస్తే అనుమానాలకు బలం చేకూరుతుంది. అయితే వాహనం ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు.
‘నా భర్తను కొట్టి చంపేశారు’
తన భర్త రాముడిది హత్యేనని భార్య చంద్రమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. రాత్రి 11 గంటల సమయంలో జాతీయరహదారిపై మద్యం దుకాణం వద్ద గొ డవ జరుగుతుందని తెలిసి బిడ్డతో కలిసి వెళ్లగా అప్పటికే రాముడు మృతిచెందాడన్నారు. తాను వచ్చేటప్పటికే మృతదేహాన్ని పోలీసులు ప్రభుత్వాస్పత్రికి తరలించారని చెప్పింది. తన భర్తది హత్యేనని, తాను, ఐదుగురు బిడ్డలు అనాథలుగా మారామని వాపోయింది. ఘటనా స్థలంలో ప్రమాదం జరిగిన ఆనవాళ్లు లేవని మృతుని వదినలు నర్సమ్మ, పెద్దింట్లు అంటున్నారు. మద్యం దుకాణం వద్ద జరిగిన గొడవలో రాముడిని చంపేశారని ఆరోపిస్తున్నారు.
అనుమానాలు ఎన్నో..
పెరవలి పోలీసులు రాత్రి 10 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. అయితే దుకాణదారులు గాని స్థానికులు గాని తామేమీ చూడలేదంటున్నారు. సాధారణంగా ఆ సమయంలో ఈ ప్రాంతం రద్దీగా ఉంటుంది. దుకాణాలు 11 గంటల వరకు తెరిచి ఉంటాయి. అయినా ఎవరూ చూడ లేదనడం, మృతుని శరీరంపై గాయాలుండటం అనుమానాలకు తావిస్తోంది.