
తెలంగాణ నేలపై పసిడి పంటలు
ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేసి తెలంగాణ నేలపై పసిడి పంటలు పండిస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు.
సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: హరీశ్‌రావు
- రైతులకు నీరందితే తమకు ఓట్లు పడవనే ప్రతిపక్షాల దుష్ర్పచారం
సాక్షి, నాగర్‌కర్నూల్: ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేసి తెలంగాణ నేలపై పసిడి పంటలు పండిస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. రైతు కళ్లల్లో ఆనందం చూడటమే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆయన పలు అభివృద్ధి పనులకు భూమి పూజ, అలాగే వ్యవసాయ మార్కెట్ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేశామని, ఇందుకు అవసరమైన భూసేకరణను జీఓ నం.123 ప్రకారమే చేస్తున్నట్లు చెప్పారు. భూములను ఇచ్చేందుకు రైతులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ పథకం ద్వారా డిండి ప్రాజెక్టును నింపడంతోపాటు నల్లమల ప్రాంతానికి కూడా సాగునీరు అందించే యోచనలో ప్రభుత్వం ఉందని వివరించారు. ఇప్పటివరకు పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులకు రూ.25 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. అదేవిధంగా ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ సమస్యలు రాకుండా ఉండేందుకు ప్రత్యేక కార్యాచరణను అమలుచేస్తున్నామని చెప్పారు. కొత్తగా ఏర్పడిన నాగర్‌కర్నూల్ జిల్లాలో కరువు తాండవిస్తోందని మంత్రి పేర్కొన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (కేఎల్‌ఐ) ద్వారా జిల్లాలోని 60 శాతం చెరువులన్నీ నీటితో కళకళలాడుతున్నాయని, తద్వారా పంటలు పండితే తమకు ఉనికి ఉండదన్న అక్కసుతోనే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అసత్యపు ప్రచారం చేస్తున్నారని హరీశ్‌రావు చెప్పారు.
విపక్షాల విమర్శల్లో పసలేదు
దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారని, ఆయన అనుసరిస్తున్న విధానాలే నేడు అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకంగా మారిన తరుణంలో రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఈ విషయాన్ని అంగీకరించకపోవడం విచారకరమని హరీశ్‌రావు అన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో ఏమాత్రం పసలేదని, రాబోయే అసెం బ్లీ ఎన్నికల్లో వారికి ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా నాగర్‌కర్నూల్ జిల్లాతోపాటు వనపర్తి జిల్లాకు సాగునీరు అందించినట్లు తెలిపారు. ఇప్పటికే లక్ష ఎకరాల్లో యాసంగి పంట వేసేందుకు చెరువుల్లో నీరు సిద్ధంగా ఉందని జూపల్లి పేర్కొన్నారు. గతంలో ఒక ప్రాజెక్టు నిర్మించేందుకు దశాబ్దాలు పట్టేదని, అదే టీఆర్‌ఎస్ ప్రభుత్వం మూడు, నాలుగేళ్లలోనే ప్రాజెక్టులను పూర్తిచేసి రైతుల మన్ననలు పొందిందన్నారు.
అచ్చం రైతన్నలా...
మంత్రి హరీశ్‌రావు ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా పర్యటనలో ఆయన ధరించిన పంచెకట్టు రైతులను విశేషంగా ఆకట్టుకుంది. జిల్లా మంత్రి జూపల్లి కష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి తదితరులు నాగర్‌కర్నూల్ వ్యవసాయ మార్కెట్ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి పంచెకట్టులో హాజరయ్యారు. మంత్రి ధరించిన పంచెకట్టు బాగుందని, రైతుల కోసం నిత్యం శ్రమిస్తున్న హరీశ్ పంచెకట్టులో సహజమైన రైతులా ఉన్నాడంటూ పలువురు రైతులు కితాబులిచ్చారు. కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మార్కెటింగ్ శాఖ సంచాలకులు లక్ష్మిబారుు, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు.