
పాత నోట్ల చెల్లుబాటు గడువు పెంచండి
- కేంద్ర బృందానికి నివేదించిన రాష్ట్రం
- చిన్న నోట్లు కేటాయించండి
- వ్యవసాయ లావాదేవీలకు పాత నోట్లు
- అనుమతివ్వండి.. నోట్ల రద్దుతో 3 వేల కోట్ల నష్టం
సాక్షి, హైదరాబాద్: పాత రూ.500, రూ. 1,000 నోట్లు చెల్లుబాటయ్యే గడువును మరి కొంత కాలం పొడిగించాలని కేంద్ర బృందానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. వ్యవ సాయ రంగంలో పాత నోట్ల వినియోగానికి అనుమతివ్వాలని.. విత్తనాల కొనుగోలుకు ఇచ్చినట్లే ఎరువులకూ వెసులుబాటు కల్పించాలని కోరింది. రైతులకు సేవలందించే సహకార బ్యాంకుల్లో నోట్ల మార్పిడి, పాత నోట్ల జమకు అనుమతివ్వాలని విన్నవిం చింది. నోట్ల రద్దుతో తలెత్తిన పరిస్థితులను అధ్యయనం చేసేందుకు మానవ వనరుల శాఖ అదనపు కార్యదర్శి రెడ్డి సుబ్రమణ్యం, కేంద్ర ప్రభుత్వ ఉప కార్యదర్శి అనామికసింగ్ తదితరులతో కూడిన కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చింది.
బుధవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆ బృందం భేటీ అయింది. నగదు కొరతతో ప్రజలు పడుతున్న అవస్థలను, రంగాల వారీగా నోట్ల రద్దు ప్రభావాన్ని ఈ సందర్భంగా సీఎస్ రాజీవ్‌శర్మ వివరించారు. నోట్ల రద్దు పరిణామాల కారణంగా చాలా మంది పేదలు ఉపాధి కోల్పోయారని... నిర్మాణ రంగ కార్మికులు, సన్న, చిన్నకారు రైతులు, చిరు వ్యాపారులు ఇబ్బందులు పడు తున్నారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువ నోట్లు సరఫరా చేయాలని, పోస్టాఫీ సుల ద్వారా నోట్ల డిపాజిట్, మార్పిడి సదు పాయాన్ని కొనసాగించాలని సూచించారు.
రూ.3 వేల కోట్లకుపైగా గండి
నోట్ల రద్దుతో ఈ ఆర్థిక ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం రూ.3 వేల కోట్లకు పైగా తగ్గే అవకాశముందని కేంద్రం బృందానికి సీఎస్ వివరించారు. అందువల్ల రాష్ట్రానికి ప్రత్యేక సాయం అందించాలని, సీఎస్‌టీ బకారుులు వెంటనే విడుదల చేయించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇక నోట్ల రద్దుతో భూముల కొనుగోలు, అమ్మకాలపై భారీగా ప్రభావం పడిందని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర వివరించారు. ఎక్సైజ్ ఆదాయం ప్రతి నెలా రూ.50 కోట్లు తగ్గుతుం దని, వచ్చే నాలుగు నెలల్లో వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం రూ.250 కోట్లు తగ్గుతుందని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా తెలిపారు.
రవాణా రంగంలో నెలకు రూ.90 కోట్ల మేరకు ఆదా యం పడిపోతుందని ముఖ్య కార్యదర్శి సునీ ల్‌శర్మ వివరించారు. ఈ సమావేశంలో ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శులు పార్థసారథి, నవీన్ మిట్టల్‌తో పాటు ఆర్‌బీఐ, ఎస్‌బీహెచ్, ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంక్, నాబార్డ్ ,కో-ఆపరేటివ్ బ్యాంకు అధికారులు తదిత రులు పాల్గొన్నారు.
బ్యాంకర్ల ఆందోళన
సరిపడా డబ్బు లేకపోవడంతో బ్యాంకులు మూసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని రాష్ట్రంలోని బ్యాంకర్లు కేంద్ర బృందానికి స్పష్టం చేశారు. ఖాతాదారులకు సరిపడేంత డబ్బు ఆర్‌బీఐ నుంచి తమకు అందటం లేదని ఫిర్యాదు చేశారు.
కేంద్రానికి నివేదిస్తాం
నోట్ల రద్దుతో ఏర్పడిన ఇబ్బందులను తెలుసుకునేందుకు, ప్రత్యక్షంగా పరిస్థితిని పరిశీలించేందుకు తాము రాష్ట్రంలో పర్యటిస్తున్నామని కేంద్ర ప్రభుత్వ అదనపు కార్య దర్శి రెడ్డి సుబ్రమణ్యం చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రం లో అందుబాటులో ఉన్న కరెన్సీ, సరఫరా జరుగు తున్న తీరు, బ్యాంకుల వద్ద రద్దీ, నియంత్రణ, బ్యాంకు సేవలు, చిరు వ్యాపారు లు, రైతుల ఇబ్బందులన్నీ పరిశీలించి.. ఎలాంటి సహాయక చర్యలు అవసరమో కేంద్రానికి నివే దిస్తామన్నారు. అనంతరం కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో పర్యటనకు కేంద్ర బృందం బయలుదేరి వెళ్లింది.