ఆలయాల క్షేత్రం నదీఅగ్రహారం | Temples of temple Nadee Agraharam | Sakshi
Sakshi News home page

ఆలయాల క్షేత్రం నదీఅగ్రహారం

Published Fri, Aug 5 2016 12:58 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM

సీతారాముల ఆలయం

సీతారాముల ఆలయం

 
రామచంద్రుడు నడయాడిన పవిత్రస్థలంగా, లక్ష్మణుడు అలిగి వెళ్లిన చోటుగా, శక్తిమాత సంచరించిన ప్రదేశంగా... కష్ణవేణమ్మ స్వయంగా ప్రత్యక్షమైన స్థలంగా.. నది అగ్రహారం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ స్ఫటిలింగేశ్వర, శ్రీ ఆనందరాముల, సంతాన వేణుగోపాలస్వామి, ఆంజనేయస్వామి ఆలయాలతో పాటు రామావధూత, అహోబిల, దత్తాత్రేయ, నవగ్రహ పీఠాలన్నాయి. ఆ ఆలయాల విశిష్టత, చరిత్రపై ప్రత్యేక కథనం..
– గద్వాల/గద్వాల న్యూటౌన్‌
గద్వాల పట్టణానికి ఉత్తరాన మూడు కిలోమీటర్ల దూరంలో కష్ణానది ప్రవహిస్తోంది. ఇక్కడ కష్ణమ్మ పడమర దిక్కు నుంచి తూర్పునకు ప్రవహిస్తోంది. నదితీరాన గద్వాల సంస్థానాధీశుల కాలంలో బ్రాహ్మణ కుటుంబాలు ఎక్కువగా ఉండటంతో బ్రాహ్మణ అగ్రహారంగా పిలిచేవారు. రానురాను కష్ణా అగ్రహారంగా.. నేడు నది అగ్రహారంగా మారింది. 
 
భద్రాది రామాలయ విశిష్టత..
ఇక్కడున్న ఆనంద భద్రాది సీతారాముల ఆలయాన్ని 12వ శతాబ్దంలో శ్రీ రామావధూత ఆధ్వర్యంలో నిర్మించారు. అవధూత ఇక్కడికి చేరుకొని నదిలో శ్రీరాముడి పాదం చూసి, ఏదో ప్రత్యేక ఉందని భావించి అక్కడే ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నదిలో ఎర్రని రంగుబట్టపై కూర్చుని నిత్యం తపస్సు చేసేవారని పురాణం చెబుతోంది. రోజుమాదిరిగానే ఒకరోజు తపస్సు చేసిన అనంతరం శ్రీరాముడు ప్రత్యక్షమై విగ్రహాన్ని ప్రతిష్ఠించమని చెప్పారంట. నదిలోనుంచి లేచే సరికి అవధూత చేతిలో సీతారాముల పాలి విగ్రహాలు కన్పించాయి. ఓ రోజు గద్వాల సంస్థానానికి చెందిన రాజు అటుగా వెళ్తూ నీటిపై ఎలా వెళ్లి తపస్సు చేస్తున్నావని అవధూతను ప్రశ్నించాడు. అందుకు ఆయన ఎర్రబట్టపై వెళ్లి వస్తానని చెప్పారట. రాజు నమ్మకపోవడంతో అవధూత ఆయనను ఎర్రబట్టపై కూర్చోబెట్టుకుని తపస్సు చేసే ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆశ్చర్యపోయిన రాజు తన చేతికి ఉన్న కంకణాన్ని అవధూతకు అందించారు. అవధూత ఆ కంకణాన్ని నదిలోకి విసిరారు. ఎందుకిలా చేశావని అడుగగా కష్ణవేణమ్మకు ఇచ్చానని చెప్పారట. గంగా భగీరథ ఉత్సవాలు జరిపిస్తే కష్ణవేణమ్మ నుంచి కంకణాన్ని తెప్పిస్తానని చెప్పారు. ఇందుకు రాజు ఒప్పుకున్నారు. కష్ణవేణమ్మ నదిలో నుంచి తన రెండు చేతులను బయటకు తెస్తూ కంకణాన్ని తిరిగి ఇచ్చింది. అప్పటి నుంచి ఇక్కడ యేటా ఆషాడమాసంలో గంగాభగీరథ ఉత్సవాలను సంస్థానాధీశులు నిర్వహించేవారు. ఇదే క్రమంలో రాజు సహకారంతో అవధూత రామాలయాన్ని నిర్మించారు. 
 
లక్ష్మణుడు లేని సీతారాముల విగ్రహాలు 
ఇక్కడి భద్రాది సీతారాముల ఆలయానికి మరో విశిష్టత ఉంది. ఆలయంలో లక్ష్మణుడు లేకుండానే సీతారాముల విగ్రహాలు దర్శనమిస్తాయి. వేటమార్గంలో రామలక్ష్మణులు నదిదాటుతూ ప్రస్తుతం ఉన్న ఆలయ ప్రాంతానికి చేరుకున్నారట. లక్ష్మణుడు రాములవారికి ఎదురు మాట్లాడుతూ ఇక తాను విల్లును, బాణాలను మోసుకొని రాలేనని అలిగి నది అవతల వైపుకు తిరిగి వెళ్లిపోయారట. నదిదాటిన తర్వాత లక్ష్మణుడు నేను అన్నకు ఎదురు చెప్పడమేమిటని ఆశ్చర్యపోయి, అందుకు పశ్చాత్తాపపడుతూ తప్పిదమైందని రాములవారిని వేడుకున్నారంటా. ఇది నీ తప్పుకాదని, ఈ స్థలంలో శక్తిమాత సంచరించడం వల్ల ఇలా జరిగిందిని రాముల వారు చెప్పారంటా. అందుకే లక్ష్మణుడు లేనిసీతారాముల విగ్రహాలు ఇక్కడ ఉన్నాయని పురాణం చెబుతోంది. ఈ  ఆలయం రెండు అంతస్తుల్లో ఉంది. పక్కనే శివాలయం, కింది అంతస్తులో ఆంజనేయస్వామి, ఆ కింది అంతస్తులో నాగశేషుల విగ్రహాలున్నాయి. ఇక్కడ సీతారాముల వారికి అభిషేకం చేస్తే ఆ నీళ్లు ఆంజనేయస్వామిపై పడుతూ నాగశేషుల విగ్రహాలకు చేరి అభిషేకం అవుతాయి. ఇక్కడే ఈశ్యానభాగంలో గణపతి, భవానిశంకరుడు, దత్తాత్రేయ, కాళభైరవ విగ్రహాలున్నాయి. ఆలయ కింది భాగంలో శ్రీరామావధూత సజీవ సమాధి అయ్యారని ప్రతీతి.
 
కాశీ స్ఫటిక లింగ విశిష్టత..
నది ఒడ్డున స్ఫటిక లింగేశ్వర ఆలయం ఉంది. గద్వాల మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మకు సంతానం లేకపోవడంతో పండితుల సూచన మేరకు కాశీ నుంచి స్ఫటిక లింగాన్ని తెప్పించారు. ఈ లింగానికి 1016బిందెల పాలతో అభిషేకం చేసి శివుడి తాకమని సూచించారు. అలా చేయడం వల్ల ఆది లక్ష్మిదేవమ్మకు పెద్దబుచ్చి దరెమ్మ, చిన్నబుచ్చి దరెమ్మలు జన్మించారట.
 
గంగాభిముఖ్‌ ఘాట్‌ ఆంజనేయస్వామి 
స్ఫటిక లింగేశ్వర ఆలయం పక్కన వెలసిన ఆంజనేయస్వామి విగ్రహానికి ప్రత్యేకత ఉంది. అన్ని ఆంజనేయస్వామి ఆలయాల్లో స్వామివారి విగ్రహాలు దక్షిణముఖం వైపు ఉంటాయి. కానీ ఇక్కడ ఉత్తరం వైపు ఉంటుంది. అహోబిల మఠం 27వ పీఠాధిపతి వీరరాఘవ వేదాంత యతీంద్ర మహాదీక్షుల బందావనం, సంతాన వేణుగోపాలస్వామి, వేంకటేశ్వరస్వామి ఆలయాలు ఉన్నాయి. శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాలను మరమ్మతు చేసేందుకు పుష్కరాలలో భాగంగా దేవాదాయశాఖ రూ.20లక్షలు మంజూరు చేసింది.
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement