
ఒత్తిడిలో వ్యవసాయశాఖ
– మొన్న ఇన్‌పుట్, రుణమాఫీ, నిన్న ఎరువులు, నేడు రెయిన్‌గన్లు
– సొంతం చేసుకునేందుకు తమ్ముళ్ల పోటీ
– టెన్షన్ భరించలేక ఆసుపత్రిపాలైన జేడీఏ, డీడీఏ
– అనుమతిస్తే సెలవులో వెళ్లేందుకు ఏడీఏ, ఏవోలు రెడీ
అనంతపురం అగ్రికల్చర్: మునుపెన్నడూ లేనివిధంగా వ్యవసాయశాఖ అధికారులు ఒత్తిళ్ల మధ్య నలిగిపోతున్నారు. రైతు ప్రభుత్వమని గొప్పలు చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఆచరణకు వచ్చే సరికి రైతులకు అరకొర పథకాలు అమలు చేస్తుండటం, వాటిని దక్కించుకునేందుకు అధికార పార్టీ నేతలు అర్రులు చాస్తుండటంతో అధికారులకు దిక్కుతోచడం లేదు. మరో వైపు పథకాల పురోగతిపై క్షేత్రస్థాయికు వెళ్లే అవకాశం ఇవ్వకుండా సమయం సందర్భం లేకుండా సభలు, సమావేశాలు, సమీక్షలు ఏర్పాటు చేస్తుండటంతో జేడీఏ స్థాయి నుంచి ఎంపీఈఓ వరకు సతమతమవుతున్నారు.
ఈ పరిస్థితుల్లో పొలంబాట, పొలంపిలుస్తోంది లాంటి కార్యక్రమాలు చేపట్టి రైతులతో మమేకం కావాల్సిన వ్యవసాయశాఖ అధికారులు జిల్లా కేంద్రం, కార్యాలయాలకే పరిమితమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సాధ్యమైనంత ఎక్కువగా కైవసం చేసుకునేందుకు తెలుగు తమ్ముళ్లు ఆరాటపడుతుండటంతో వ్యవసాయశాఖ అధికారుల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా తయారైంది. ఈ క్రమంలో ఆ శాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి ఆస్పత్రిపాలవగా డీడీఏ డి.జయచంద్ర కూడా అనారోగ్యం వల్ల సెలవు పెట్టారు. పై అధికారులు అనుమతిస్తే సెలవులో వెళ్లేందుకు సగం మంది ఏడీఏలు, ఏవోలు సిద్దంగా ఉన్నట్లు ఆ శాఖలో చర్చ జరుగుతోంది.
సమస్యల వలయంలో అధికారులు
2014 ఖరీఫ్‌కు సంబంధించి మంజూరైన రూ.559 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ పరిహారాన్ని ఇప్పటికీ రైతులకు సరిగా పంపిణీ చేయలేదు. ప్రభుత్వం రుణమాఫీ కూడా సరిగా చేయకపోవడంతో వ్యవసాయశాఖ అధికారులు బుక్ అయ్యారు. ఇపుడు రెయిన్‌గన్లు, స్ప్రింక్లర్లు, డీజిల్ ఇంజిన్లు, హెచ్‌డీ పైపుల ద్వారా వేరుశనగ ఎండిపోకుండా రక్షకతడులు ఇస్తున్న కార్యక్రమం ఆ శాఖ అధికారులను మరింత వేధిస్తోంది.
ఏపీఎంఐపీతో పాటు ఇరిగేషన్ కంపెనీలు కేవలం పరికరాలు సరఫరా చేసి చేతులు దులిపేసుకోవడంతో పూర్తీ బాధ్యత తమకు అప్పగించడంపై ఏవోలు మండిపడుతున్నారు. ఒక్కో రెయిన్‌గన్ రూ.25 వేలు, ఒక్కో స్ప్రింక్లర్ సెట్ రూ.19 వేలు, ఒక్కో డీజిల్ ఇంజన్ రూ.35 వేలు, ఒక్కో హెచ్‌డీ పైపు రూ.725 విలువ చేస్తుండటంతో వాటిని ఎలాగైనా వశం చేసుకునేందుకు గ్రామ, మండల స్థాయి నాయకులు ఎత్తులు వేస్తుండటంతో వాటిని ఎలా కాపాడుకోవాలో అర్థంకాని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇక నెల రోజుల కిందట వ్యవసాయశాఖకు ఓ కుదుపు కుదిపిన ఎరువుల కుంభకోణం ఏకంగా ఇరువురు ఏడీఏలపై వేటు పడటంతో ఆ శాఖపై మరింత ఒత్తిడి పెరిగింది. ఎవరో చేసిన తప్పిదాలకు తమను బాధ్యులను చేస్తూ ఒత్తిడికి గురి చేస్తుండటంతో మానసికంగా కృంగిపోతున్నారు.