
తాండూరు సిస్టర్స్
ఏ ఇంట్లోనైనా ఒకరో .. ఇద్దరో కళాకారులు ఉంటారు.. కానీ ఆకుటుంబంలో మాత్రం ఏకంగా నలుగురు అక్కాచెల్లెల్లు ఉన్నారు.
♦ నృత్యంలో నలుగురు అక్కాచెల్లెళ్ల ప్రతిభ
♦ జాతీయ స్థాయిలో గుర్తింపు
♦ జాతీయస్థాయిలో మెరిసిన అక్కాచెల్లెళ్లు
♦ ప్రముఖుల ఎదుట ప్రదర్శనలు
♦ కురిసిన ప్రశంసల జల్లులు
ఏ ఇంట్లోనైనా ఒకరో .. ఇద్దరో కళాకారులు ఉంటారు.. కానీ ఆకుటుంబంలో మాత్రం ఏకంగా నలుగురు అక్కాచెల్లెల్లు ఉన్నారు. సంప్రదాయ నృత్యంలో ఒకరికి మించి ఒకరు అనతికాలంలోనే పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు. కన్నవారికి.. పుట్టిన ఊరికి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చారు. జాతీయస్థాయిలో తమ అద్భుత ప్రదర్శనలతో ఔరా అనిపించారు. దేశప్రధాని, రాష్ట్రపతి మొదలు ఎంతోమంది ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. తాండూరు సిస్టర్స్‌గా ముద్రపడిపోయారు. వారి కళా ప్రస్థానమే ఈ ఆదివారం ప్రత్యేకం. - తాండూరు
ఆ నలుగురు అక్కా చెల్లెళ్లు.. అటూఇటుగా అచ్చుగుద్దినట్టే ఉంటారు.. వాళ్ల ప్రతిభ కూడా ఒక్క రంగంలోనే.. అదే నృత్యం. అందం, అభినయంతో దేశవిదేశాల్లో ఎంతో మంది ప్రముఖుల ప్రశంసలందుకున్నారు. ఇక దేశీయంగా 20 రాష్ట్రాల్లో ప్రదర్శనలిచ్చారు. అనేక జాతీయస్థాయి వేదికలపై నర్తించి తామేంటో చాటిచెప్పారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రధాని మోదీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వంటి వారిని సైతం మెప్పించారు. వారే తాండూరుకు చెందిన రాములు, నర్మద దంపతుల కూతుళ్లు వాణి, భాగ్యలక్ష్మి, సుస్మిత, సౌమ్య. వీరిని స్థానికంగా అందరూ ‘తాండూరు సిస్టర్స్’ అంటారు. వారి విజయ ప్రస్థానమే.. ఈ వారం సండే స్పెషల్.. - తాండూరు
తాండూరు పట్టణంలోని గుమస్తానగర్‌లో నివసిస్తున్న రాములు, నర్మద దంపతులకు నలుగురు కూతుళ్లు. వాణి బీఎస్సీ పూర్తి చేయగా, భాగ్యలక్ష్మి బీఏ, సుస్మిత బీకాం (తృతీయ), సౌమ్య (పాలిటెక్నిక్) చదువుతున్నా రు. 2009లో మొదలైన వీరి నృత్యప్రస్థానం ఏడేళ్లలో దేశ వ్యాప్తంగా నృత్యప్రదర్శ నలు ఇచ్చే స్థాయికి ఎదిగింది. మా థూరి,థింసా, గిరిజన సంప్రదాయ నృ త్యాల్లో వీరు దిట్ట. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతోపాటు వివిధ రాష్ట్రాల ప్రముఖుల సమక్షంలో నృత్యప్రదర్శనలు ఇచ్చి వారి నుంచి ప్రశంసలు అందుకున్నారు.
నృత్యంపై ఆసక్తి ఇలా..
వాణి, భాగ్యలక్ష్మి స్థానిక శిశుమందిర్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. పాఠశాలలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఇలా నృత్యంపై విద్యార్థి దశలోనే ఆసక్తిని పెంచుకున్నారు. ఈ సమయంలో తాండూరుకు చెందిన ఫైన్స్‌ఆర్ట్స్ కల్చరల్ అకాడమీ అధ్యక్షుడు,డాన్స్ మాస్టర్ అశోక్ వీరి ప్రతిభను గుర్తిం చిప్రోత్సహించారు. అక్కడి నుంచి వివిధ వేదికలపై నృత్యప్రదర్శనలు ఇస్తూ వచ్చారు. అక్కాచెల్లెలు హైదరాబాద్‌కు చెందిన మరో డాన్స్ మాస్టర్ హరికిషన్ దృష్టిలో పడ్డారు. సంప్రదాయ నృత్య రీతుల్లో ఆయన మెళకువలను నేర్పించారు. 2010లో రవీంద్రభారతిలో శ్రీకృష్ణతులాభారం నాటకంలో వాణికి అవకాశం దక్కింది. చక్కని అభినయంతో అందరి అభినందనలు అందుకుంది. తన నృత్యప్రదర్శనతో భాగ్యలక్ష్మి కూడా మెరిసింది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక, ఫుడ్‌మేళా తదితర కార్యక్రమాల్లో అక్కాచెల్లెలు నృత్యప్రదర్శనలు ఇస్తూ వస్తున్నారు.
అక్కలను చూసి చెల్లెల్లు..
వాణి, భాగ్యలక్ష్మిలతో స్ఫూర్తి పొందిన చెల్లెలు సుస్మిత, సౌమ్య కూడా సంప్రదాయ నృత్యం నేర్చుకున్నారు. అక్కల బాటలోనే పయనిస్తూ ప్రతిభను చాటుతున్నారు.
తాండూరులో నృత్యఅకాడమీ..
వాణి, భాగ్యలక్ష్మి ప్రస్తుతం తాండూరులో నటరాజ్ నృత్య అకాడమీని కొనసాగిస్తున్నారు. ఇందులో కూచిపూడితోపాటు క్లాసికల్, వెస్టర్న్ డాన్స్‌లపై చిన్నారులకు శిక్షణ ఇస్తున్నారు.
ఇదీ పరంపర..
అమృత్‌సర్‌లో 2009లో నేషనల్ యూత్ ఫెస్టివల్, 2010లో చంఢీగడ్‌లో వరల్డ్ కబడ్డీ పోటీల ప్రారంభోత్సవం, ఇదే సంవత్సరంలో రవీంద్రభారతిలో ప్రపంచ నృత్య దినోత్సవం, ఢిల్లీలో కామన్‌వెల్త్ క్రీడల ప్రారంభోత్సవం, 2012లో తాండూరులో కేంద్ర సాంస్కృతిక శాఖ జాతీయ యువజనోత్సవాలు, 2013లో కేరళలో ఓనమ్ ఫెస్టివల్, 2015లో ఢిల్లీలో గణతంత్ర వేడుకల్లో తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. తమిళనాడు, జార్ఖండ్, కర్ణాటక, రాజస్థాన్ తదితర 20 రాష్ట్రాల్లో లంబాడీ, మాథూరి, థింసా నృత్యరీతుల్లో ప్రతిభ చాటారు. తాజాగా ఈ ఏడాది జనవరి 8 నుంచి 15వ తేదీ వరకు ఢిల్లీలో నిర్వహించిన సూరజ్‌కుండ్ మేళాలో నలుగురికీ అవకాశం వచ్చింది. జైసల్మేర్‌లో సైనికుల కోసం నృ త్యప్రదర్శన ఇచ్చా రు.
మాజీ రాష్ట్రపతులు అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్‌తోపాటు ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీతోపాటు అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామాల సమక్షంలో గత ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ శకటంపై బోనాల ప్రదర్శనలో వాణి పాల్గొంది. 2012లో ఔరంగాబాద్‌లో నృత్యప్రదర్శన అనంతరం తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో వాణి, భాగ్యలక్ష్మి తండ్రి రాములుతోపాటు డాన్స్ మాస్టర్ హరికిషన్ తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో మాస్టర్ హరికిషన్ మృతి చెందారు. అప్పట్లో తండ్రికి సపర్యలు చేస్తూనే నృత్యప్రదర్శనలు ఇచ్చానని వాణి వివరించింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ముందుకు సాగుతున్నామని, ఎప్పటికైనా విదేశాల్లో నృత్యప్రదర్శన ఇవ్వాలన్నదే తమ లక్ష్యమంటున్నారు ఈ అక్కాచెల్లెళ్లు.