సీతంపేట : అందమైన అమ్మాయిలు ఒకే చోట సందడి చేస్తే... కెవ్వు కేక పెడితే..హార్‌ట బీట్ పెరగదా...మనసు ఉప్పొంగదా...కళ్లు మిరుమిట్లు గొలపవా...! అధరాలు మధురంగా నవ్వవా..సున్నితమైన ఆ చేతులు చప్పట్ల మోత మోగించవా...! ఈ సీతాకోక చిలుకల్లాంటి అమ్మాయిలంతా ‘కళ’ర్‌ఫుల్‌గా బుల్లయ్య మహిళా ఇంజినీరింగ్ కళాశాల్లో మెరిశారు. ఫ్రెషర్స్ డే వేడుకల్లో మతిపోగొట్టారు.
నయా ఫ్యాషన్‌సకు బ్రాండ్ అంబాసిడర్లయ్యారు. హద్దులు లేవు..ఆంక్షలు లేవు..ఉన్నదంతా ఆకాశమంతా ఆనందం...కడిలి మురిసేలా సందడి..నేల పులకించేలా నాట్యవిన్యాసం. ర్యాంప్ వాక్..ఫ్యాషన్ షో..డ్యాన్సులు, పాటలు ఒకటేమిటి తమలో ఉన్న కళలన్నీ ప్రదర్శించారు. సందేశాత్మక నాటికలు, మూకీ ప్రదర్శనలతో, చలోక్తులు, కామెడీ స్కిట్స్‌తో ఆద్యంతం ఆహ్లాదపరిచారు. వీరిని మరింత ఉత్సాహాన్నిచ్చేందుకు ‘తనువచ్చెనంట’ చిత్ర యూనిట్ ఫ్రెషర్‌సడేకు అతిథులుగా వచ్చారు. ప్రముఖ యాంకర్, నటి రేష్మీ గౌతమ్, హీరో తేజ, కమెడియన్ చలాకీ చంటీ విద్యార్థులతో సందడి చేశారు.
బ్యూటీలమధ్య సెల్ఫీలతో హోరెత్తించారు. తను వచ్చెనంట వినోదాత్మక చిత్రమని, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని అందరూ సినిమా చూసి ఆదరించాలని వీరు కోరారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ జి.మధుకుమార్ మాట్లాడుతూ వినోదం, ఆట పాటలే కాదు, విజ్ఞానం ప్రధానమన్న విషయాన్ని విస్మరించరాదన్నారు.
విద్యార్థి దశలో చదువు కీలకమైనదని, ఈ దశలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుంటే ఎంచుకున్న రంగంలో ఉన్నతంగా రాణించగలరన్నారు. జూనియర్ విద్యార్థులను ఆహ్వానిస్తూ సీనియర్లు ప్రదర్శించిన శాస్త్రీయ, జానపద, పాశ్చాత్య నృత్యాలు , గీతాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కె.వి.వి.ఎస్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ఎస్.ఎం.రెహమాన్, పీఆర్‌వో కె.సత్యనారాయణ, స్టూడెంట్ కో ఆర్డినేటర్ వి. రాధాదేవి పాల్గొన్నారు.