
మహానందిలో అంతే !
మహానంది క్షేత్రంలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మహానందీశ్వరుడు దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సింది పోయి వారిని దోపిడీకి గురి చేస్తున్నారు.
- మహానంది క్షేత్రంలో ఉచిత దర్శనం కల్పించాలని ఇటీవల ఆర్‌జేసీ భ్రమరాంబ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు ఉచిత దర్శనం ఏర్పాటు చేశారు. కానీ నామమాత్రంగా అమలవుతుంది. ఆలయ రాజగోపురం దాటి వెళ్లిన తర్వాత ముఖద్వారం వద్ద కేవలం ఒక్కబోర్డు మాత్రమే ఉచితదర్శనం అని ఉంచారు. మహానందికి కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తదితర ప్రాంతాల నుంచి భక్తులు వేలసంఖ్యలో వస్తుంటారు. వారి భాషలను అనుగుణంగా ఎక్కడా ఒక్కబోర్డు కూడా లేదు.
- ఆలయానికి ధ్వజం ఆత్మసమానమైనది అంటారు. అయితే మహానందీశ్వరుడి భక్తులకు «ధ్వజ స్తంభ దర్శనం కరువైంది. అలాగే ఏడాదికి ఒకసారి వచ్చే వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే ఎక్కడైనా ఉత్తరద్వార దర్శనం ఉంటుంది. కానీ ఇక్కడ నిరంతరంగా ఉత్తరద్వార దర్శనం ఏర్పాటు చేయడం ఆశ్చర్యం.
- మహానందీశ్వరుడికి నిత్యం జరగాల్సిన శాస్త్రోక్తమైన పూజలు సక్రమంగా జరగడం లేదు. భగవంతుడికి వేకువజామున, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో సమర్పించే నివేదన ఎంతో పవిత్రమైన కార్యం. సధ్బ్రాహ్మణుడు మాత్రమే మడికట్టుకుని స్వామి, అమ్మవారికి నివేదన సమర్పించాలి. కానీ మహానందిలో మాత్రం సాధారణ పరిచారకులతో నివేదన సమర్పిస్తున్నారు.
- వీఐపీలు వచ్చినప్పుడు భాజాభజంత్రీలు పూర్తి స్థాయిలో ఉంటారు. నివేదన, మిగతా సమయాల్లో ఒకరిద్దరు మాత్రమే అందుబాటులో ఉంటారు.
- క్షేత్రంలో రెగ్యులర్ సిబ్బందికి మినహా మిగిలిన వారికి డ్రెస్‌కోడ్ లేదు. దీంతో భక్తులు సిబ్బందిని గుర్తించడం కష్టమవుతుంది. పలు పర్యాయాలు ఘర్షణలు సైతం జరిగాయి. ఏజెన్సీ, పారిశుధ్య విభాగం, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి డ్రెస్ కోడ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
- పడితరం దిట్టానికి అనుగుణంగా లడ్డూలు, పులిహోర తయారు చేయాల్సి ఉండగా నాణ్యతలోపంతో తయారు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వీరికి ప్రతినెలా మామూళ్లు ముడుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
- లడ్డూ ఉండాల్సిన పరిమాణం కంటే తక్కువగా ఉంటోంది. ప్రసాదాల తయారీని ఏళ్లతరబడి ఒకరికే అప్పగిస్తున్నారు.