సాక్షి, సిటీబ్యూరో: వరదలు ముంచెత్తిన అపార్ట్‌మెంట్లను ఇంకా చీకట్లు వీడలేదు. సెల్లార్లలో చేరిన వర్షపు నీటిని మోటార్లతో తోడినా ఎంతకూ ఖాళీ కావడం లేదు. దీంతో ఆయా అపార్ట్‌మెంట్స్ పైఅంతస్తుల్లో చిక్కుకుపోయిన వారు నానాపాట్లు పడుతున్నారు. కూకట్‌పల్లి, నిజాంపేట్, బాచుపల్లి, మియాపూర్, కుత్బుల్లాపూర్, మల్కజ్‌గిరి తదితర ప్రాంతాల్లో 198 అపార్ట్‌మెంట్ సెల్లార్స్ నీటమునిగాయి.
సెల్లార్లలో ఏర్పాటు చేసిన 1500పైగా విద్యుత్ మీటర్లు, ప్యానల్ బోర్డులు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు నీట మునగడంతో ముందస్తు చర్యలో భాగంగా డిస్కం ఆయా అపార్ట్‌మెంట్లు, కాలనీలకు మంగళవారం రాత్రి నుంచే విద్యుత్ సరఫరా నిలిపి వేసిన సంగతి తెలిసిందే. వీటిలో ఇప్పటి వరకు 160పైగా అపార్ట్‌మెంట్లకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించగా, మరో 30పైగా అపార్ట్‌మెంట్లు గత నాలుగు రోజుల నుంచి అంధకారంలోనే మగ్గుతున్నాయి.
ఇక శుక్రవారం కాప్రా నాలా ఉధృతంగా ప్రవహించడంతో మనోజ్‌నగర్ సమీప నాలాకు ఆనుకుని ఉన్న మూడు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో ఆ ప్రాంతమంతా కరెంటు కట్ అయింది. విద్యుత్ సమస్యలపై 1912 కాల్‌సెంటర్‌కు కానీ, 100, 040–21111111, 7382072104, 7382072106, 7382071574, 9490619846 నెంబర్లకు గానీ సమాచారం ఇవ్వాలని డిస్కం సీఎండీ రఘుమారెడ్డి సూచించారు.