- జనావాసాల్లో దుకాణాల ఏర్పాటుపై పెల్లుబికిన ఆగ్రహం
- జిల్లా వ్యాప్తంగా కొనసాగిన ధర్నాలు, రాస్తారోకోలు
అనంతపురం : గుడి, బడి తేడా లేకుండా జనావాసాల్లో మద్యం దుకాణాల ఏర్పాటుపై అనంత ప్రజలు భగ్గుమన్నారు. సోమవారం అనంతపురం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మహిళలు, విద్యార్థులు ఆందోళనలకు దిగారు. నల్లమాడలో కేంద్రంలోని ఆర్డీటీ ఏరియా కార్యాలయం ఎదురుగా మద్యం ఏర్పాటు చేయడంపై ఆర్డీటీ మహిళా సంఘాల సభ్యులు అభ్యంతరం తెలిపారు. సోమవారం నల్లమాడ, ఓడీ చెరువు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఆర్డీటీ సంఘ సభ్యులు ర్యాలీ, రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించారు.
అలాగే ఓడీచెరువు మండల కేంద్రంలోని షాదీమహల్, టీటీసీ కళాశాలకు ఎదురుగా కొత్తగా ఏర్పాటు చేసిన మద్యం షాపును వెంటనే ఎత్తివేయాలంటూ కళాశాల విద్యార్థులు, సీపీఐ నాయకులు సోమవారం కదిరి- హిందూపురం రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రాయదుర్గంలోని దాసప్ప రోడ్డులో మద్యం షాపు ఏర్పాటును నిరసిస్తూ కార్మికులు, చిరు వ్యాపారులు తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.
అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఇక కదిరి మున్సిపల్ పరిధిలోని ఎర్రగుంటపల్లికి చెందిన మహిళలు సోమవారం తమ గ్రామంలో మద్యం దుకాణం వద్దంటూ జాతీయరహదారిపై ఆందోళన నిర్వహించారు. డిగ్రీ కళాశాలకు సమీపంలో జాతీయరహదారిపై అడ్డంగా బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. జనావాసాల్లో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడం వల్ల శాంతిభద్రల సమస్య ఉత్పన్నమవుతుందని, అందువల్ల వెంటనే వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు.
జిల్లాలో మొత్తం మద్యం దుకాణాలు : 245
జనావాసాల్లోని మద్యం దుకాణాలు : 178
బెల్టు షాపులు : 2,780