రాజధాని ‘ఔటర్’కు భూ సేకరణ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని చుట్టూ ఔటర్ రింగురోడ్డు నిర్మాణానికి వీలుగా భూ సేకరణ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమయ్యింది. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి రూ.20 వేలకోట్ల సాయం చేస్తామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో.. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) భూ సేకరణపై దృష్టి పెట్టింది. సాధ్యాసాధ్యాల (ఫీజబిలిటీ) నివేదిక, సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లు రూపొందించేందుకు బిడ్డర్లు/కన్సార్షియంలను సైతం ఆహ్వానించింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 26 మండలాలు, 89 గ్రామాల మీదుగా ఈ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించనున్నారు. కృష్ణా జిల్లాలో 15, గుంటూరులో 11 మండలాల్లో భూసేకరణ చేపడతారు.
150 మీటర్ల వెడల్పుతో 210 కిలోమీటర్ల మేర రింగురోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. కిలోమీటర్ రోడ్డు నిర్మాణానికి రూ.10 కోట్ల మేర ఖర్చు చేయనున్నారు. అంటే మొత్తం రూ.21 వేల కోట్లకు పైగా ఖర్చు కానుంది. ఇందులో 20 వేల కోట్ల మేరకు కేంద్ర సాయం ఉంటుందని ఇటీవల కేంద్ర ఉపరితల, రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ విజయవాడలో ప్రకటించిన సంగతి తెలిసిందే. రహదారి నిర్మాణానికి అవసరమయ్యే భూమి అప్పగిస్తే వెంటనే పనులు ప్రారంభిస్తామని కూడా గడ్కరీ పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో రింగ్‌రోడ్డు నిర్మాణంలో ప్రధాన సమస్య అయిన భూ సేకరణ ప్రక్రియను వీలైనంత త్వరలో పూర్తి చేసేందుకు సీఆర్‌డీఏ నడుం బిగించింది. ఔటర్ రింగు రోడ్డుకు 7వేల ఎకరాలకు పైగా భూములు అవసరమని సంస్థ భావిస్తోంది. రహదారికి మధ్య మొక్కల పెంపకం, పచ్చదనం, సర్వీసు రోడ్లు తదితరాలన్నీ కలసి కిలోమీటరు రోడ్డుకు 35 ఎకరాలు అవసరమవుతాయని తేల్చారు. అంటే 210 కిలోమీటర్లకు సుమారు 7,350 ఎకరాలు అవసరమన్నమాట.