
మాట్లాడుతున్న మంత్రి తుమ్మల
- భావితరాల మేలు కోసం మొక్కలు నాటాలి
- సింగరేణి హరితహారంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
మణుగూరు : అడవుల విస్తీర్ణంతో జిల్లాకు తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం సింగరేణి ఆధ్వర్యంలో మణుగూరులో నిర్వహించిన హరితహారంలో మొక్కలు నాటిన అనంతరం మంత్రి మాట్లాడుతూ గతంలో అడవుల పెంపకంలో జిల్లా దేశంలోనే చెప్పుకోదగిన స్థాయిలో ఉండేదని ఉమ్మడి రాష్ట్రంలోనూ అటవీ విస్తీర్ణంలో జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు. గత ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాలు, కొందరు స్మగ్లర్లు, స్వార్థపరుల కారణంగా అడవులు తగ్గిపోయాయన్నారు. తిరిగి అడవులు పెంచేందుకు ప్రజలందరి సహకారం అవసరమన్నారు.భావితరాల మేలు కోసం ప్రతి విద్యార్థి మొక్క నాటేలా ఆసక్తి కల్పించాలన్నారు. అడవులు ఉంటే అడవి బిడ్డలైన గిరిజనులకు అన్నిరకాలుగా మేలు చేసినట్లేనన్నారు.
సింగరేణి మణుగూరు ఏరియాలో ఒకేసారి పదిహేను వేల మొక్కలు నాటేలా కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఐటీడీఏ పీఓ రాజీవ్‌గాంధీ హన్మంతు, సింగరేణి ప్లానింగ్ అండ్ ప్రాజెక్టు డైరెక్టర్ మనోహర్‌రావు, ఏరియా సీజీఎం మాదాసి మల్లేష్, ఎస్వోటూ సీజీఎం నారాయణ, ఓసీ ప్రాజెక్టు అధికారి టీవీ.రావు, ఆర్డీఓ రవీంద్రనాథ్, ఎంపీపీ చిడెం అంజమ్మ, జెడ్పీటీసీ దుర్గ, తహసీల్దారు తిరుమలాచారి, మున్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్, ఎంపీడీఓ పురుషోత్తం, ఐసీడీఎస్ సీడీపీఓ సుబ్బలక్ష్మి, టీబీజీకేఎస్ నాయకుడు సామా శ్రీనివాసరెడ్డి, ఎక్స్‌లెంట్, శ్రీవిద్య పాఠశాలల కరస్పాండెంట్లు యూసుఫ్‌షరీఫ్, నూకారపు రమేష్ చౌదరి, టీఆర్‌ఎస్ నాయకులు ఎడ్ల శ్రీనివాస్, పాయం నర్సింహారావు, ముత్యంబాబు, ఉడుముల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.