పోషకాలను మోతాదు మేరకు వాడాలి
పోషకాలను మోతాదు మేరకు వాడాలి
Published Tue, Aug 30 2016 6:44 PM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM
గుర్రంపోడు
వ్యవసాయ శాస్త్రవేత్తలు వివిధ వ్యవసాయ పంటలకు అవసరమయ్యే పోషకాలను మోతాదు మేరకు వాడాల్సి ఉంటుంది.. ఉద్యానపంటలకు మాత్రం మొక్కకు వాడాల్సిన పోషకాల మోతాదును బట్టే ఎరువుల పరిమాణాన్ని సూచిస్తారు. పీల్డ్ క్రాప్‌లైన వ్యవసాయ పంటలు పత్తి, మిర్చి, వరిలాంటి పంటలకు మాత్రం పోషకాల మోతాదును మాత్రమే సూచిస్తారు. రసాయన ఎరువుల్లోని ఈ మోతాదును లెక్కగట్టి వాడితే ఖర్చు తగ్గడమేగాక పైరుకు పోషకాలు సమతుల్యంగా అందినట్లవుతుంది. ఎరువుల ధరలు తరుచూ పెరుగుతున్నందున వాటి వాడకం మరింత భారం కాకుండా పోషకాల మోతాదు గణనలో రైతులు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ మురళి సూచిస్తున్నారు. ఎరువుల్లో పోషకాల గణనపై సలహాలు, సూచనలు ఆయన మాటల్లోనే..
ఎరువుల్లో పోషకాల శాతం
ఎరువుల బస్తాపై ఆ ఎరువులో ఉండే పోషకాల శాతం ముద్రించి ఉంటుంది. యూరియా బస్తాపై 46 శాతం ఉంటుంది. అంటే వంద కిలోల యూరియాలో 46శాతం యూరియా ఉంటుంది. సింగిల్ సూపర్ పాస్పేట్‌లో 16శాతం భాస్వరం ఉంటుంది. మ్యూరేట్ ఆఫ్ పొటాష్‌లో 60 శాతం పొటాష్ ఉంటుంది. ఈ ఎరువుల్లో ఒకే పోషక పదార్థం ఉన్నందున వీటిని సూటి ఎరువులు అంటారు. రెండు లేదా మూడు పోషకాలు కలిపి ఉండే ఎరువులను కాంప్లెక్స్ ఎరువులు అంటారు. డీఏపీలో 18 శాతం నత్రజని, 46 శాతం భాస్వరం ఉంటాయి.
పోషకాల గణన ఇలా...
ఫీల్డ్ క్రాప్ పత్తి పంటకు ఎకరాకు 60 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 24 కిలోల భాస్వరం సిఫారసు చేయబడింది. ఎంచుకునే కంపెనీ ఎరువులో పోషకాల మోతాదును బట్టి అవసరమయ్యే ఎరువులను లెక్కించవచ్చు. కిలో నత్రజని కోసం 2.17 కిలోల యూరియా(100/46)ను వాడాలి. కిలో భాస్వరం అందించేందుకు 6.25 కిలోల సింగిల్ సూపర్ పాస్పేట్(100/16) వేసుకోవాలి. కిలో పొటాష్ కోసం 1.67 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ (100/60)వాడాలి. 15–15–15 బస్తాలో 7.5 కిలోల నత్రజని, భాస్వరం, పొటాష్‌లు ఉంటాయి. బస్తా డీఏపీలో 9 కిలోల నత్రజని, 23 కిలోల భాస్వరం ఉంటాయి. వ్యవసాయ పంటల్లో ఎకరాకు ఎరువు మోతాదును లెక్కించడంలో కిలో భాస్వరాన్ని డీఏపీ ద్వారా అందించాలంటే 2.17 కిలోల (100/46) డీఏపీ వాడాలి. అయితే 2.17 కిలోల డీఏపీలో కిలో భాస్వరంతోపాటు 0.4 కిలోల (18/100“2.17) నత్రజని కూడా ఉంటుంది. కిలో భాస్వరాన్ని 20–20–0 అనే కాంప్లెక్స్ ఎరువు ద్వారా అందించాలంటే 5 కిలోల (100/20) 20–20–0 అనే కాంప్లెక్స్ ఎరువు వాడాలి. అయితే 5 కిలోల 20–20–0 ఎరువులో ఒక కిలో భాస్వరంతో పాటు కిలో నత్రజని కూడా ఉంటుంది. నత్రజని, భాస్వరం, పొటాష్ పోషకాలను వాడినప్పుడు వాటి మోతాదుననుసరించి అవసరమైన ఎరువులు లెక్కగట్టి సరైన అవసరమైనంత మోతాదులో వాడి వృ«థా ఖర్చు తగ్గించుకుని, పోషకాల సమతుల్యతను పొందవచ్చు. ఎరువుల వాడకంలో కాంప్లెక్స్ ఎరువులు దుక్కిలో విత్తనాలు వేసేటప్పుడు వాడాలి. పైపాటుగా కాంప్లెక్స్ ఎరువుల వాడకం వల్ల పోషకాలు సమర్థవంతంగా పనిచేయవు. యూరియాను పలు ధపాలుగా వేయాలి. ఎక్కువగా యూరియా వాడకం వల్ల చీడపీడలు, తెగుళ్లు సోకుతాయి.
Advertisement
Advertisement