రోడ్డెక్కిన అన్నదాతలు
► రెండు గంటలు రోడ్డుపై బైఠాయింపు
► తహసీల్దార్ హామీతో ఆందోళన విరమణ
లక్ష్మణచాంద(నిర్మల్): మండల కేంద్రంలోని ఐకేపీ, డీసీఎంఎస్ వరి కొనుగోలు కేంద్రాల్లో 15రోజుల నుంచి గన్నీ సంచులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండల కేంద్రానికి చెందిన రైతులు గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా రోడ్డుపై బైఠాయించారు. దాదాపు రెండు గంటలపాటు ఆందోళన చేయడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి.
ఈ సందర్భంగా మండల కేంద్రంతో పాటు తిర్‌పెల్లి, పొట్టపెల్లి గ్రామాలకు చెందిన రైతులు మాట్లాడారు. మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 15 రోజులుగా రైతుల వద్ద కొనుగోలు చేసిన వరి ధాన్యం బస్తాలను తరలించడంలేదన్నారు. దీంతో ఇతర రైతులకు గన్నీ సంచులు ఇవ్వడం లేదన్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై మహేందర్‌రెడ్డి ఆందోళన వద్దకు వచ్చి రైతులతో మాట్లాడినా ఆందోళన కొనసాగించారు.
తహసీల్దార్ నారాయణ వచ్చి రైతులతో మాట్లాడినా ససేమిరా అన్నారు. ఆర్డీవో వచ్చి సరైన హామీ ఇచ్చేవరకూ కదిలేది లేదని భీష్మించారు. దీంతో తహసీల్దార్ ఆర్డీవోతో ఫోన్‌లో మాట్లాడి రైతుల ఆందోళన విషయాన్ని తెలిపారు. ఆర్డీవో జేసీ దృష్టికి తీసుకెళ్లి శుక్రవారం లోపు సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.