రాయదుర్గంటౌన్: కర్ణాటకలో తప్పిపోయి రాయదుర్గం పట్టణానికి చేరుకున్న ఓ ఆరేళ్ల బాలికను తల్లిదండ్రులకు చెంతకు చేర్చిన ఘటన సోమవారం జరిగింది. కర్టాటకలోని జిల్లా కేంద్రమైన దావణగెరకు చెందిన మహమ్మద్ ఉస్మాన్, సల్మాబాను కుమార్తె గౌసియాబాను(6) మానసిక వైకల్యంతో బాధపడుతుండేది. ఈ క్రమంలో ఈ బాలిక గత శుక్రవారం బస్సులో రాయదుర్గం పట్టణానికి చేరుకుంది. పట్టణానికి చెందిన సనావుల్లా, కబీర్, అల్లాబకాష్, మసూద్ అనే వ్యక్తులు బాలిక ప్రవర్తనను గుర్తించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తనది బళ్లారి అని, తల్లిదండ్రుల పేర్లను చెప్పింది. బాలిక చెప్పిన వివరాలతో మూడు రోజుల పాటు బళ్లారిలోని వివిధ ప్రాంతాల్లో వారు విచారణ చేశారు. సోమవారం బళ్లారిలోని జాగృతినగర్‌లో బాలికను ఆమె పిన్నమ్మ గుర్తు పట్టింది. బాలిక స్వగ్రామం దావణగెర అని, తల్లిదండ్రులు బాలిక తప్పిపోవడంతో అక్కడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దీంతో బాలికను బళ్లారిలోని కౌల్‌బజార్ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించి ఆమె పిన్నమ్మ ద్వారా తల్లిదండ్రులను రప్పించి అప్పగించారు.