గత పాలకుల నిర్లక్ష్యం వల్లే నిలిచిన పనులు
నిజామాబాద్ అర్బన్ : గత పాలకుల నిర్లక్ష్యం, అవినీతి వల్లే భూగర్భ డ్రెయినేజీ పనులు నిలిచిపోయాయని, ఫలితంగా నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఎంపీ కవిత పేర్కొన్నారు. నగర శివారులోని దుబ్బ ప్రాంతంలో మురుగునీటి శుద్ధిప్లాంటు పనులకు ఆదివారం ఆమె శంకుస్థాపన చేశారు. ఈ ంసదర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ గత పాలకులు అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనుల పేరిట అవినీతికి పాల్పడ్డారని, రోడ్లను ధ్వంసం చేశారన్నారు. ప్రజలు ఇబ్బందులకు గురైనా ఎవరూ పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం నగర అభివృద్ధికి నిధులు విడుదల చేశామని, ఇందులోభాగంగా అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ పనులు ప్రారంభిస్తున్నామన్నారు. అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ పనులు పూర్తయ్యాక రోడ్లన్నీంటినీ అభివృద్ధి చేస్తామన్నారు. అనంతరం అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త మాట్లాడుతూ అత్యాధునిక పరికరాలతో నీటి శుద్ధిప్లాంటు నిర్మిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ ఆకుల సుజాత, డిప్యూటీ మేయర్ ఫయీం, కార్పొరేటర్‌లు సురేష్, చాంగుబాయి, మురళీ, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వర్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.