
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
వేంపల్లె : వేంపల్లె పట్టణ పరిధిలోని కడప – పులివెందుల బైపాస్ రోడ్డు వద్ద మదర్‌థెరిస్సా పాఠశాల దగ్గరలో మంగళవారం సాయంత్రం డి.వెంకటసుబ్బారెడ్డి అనే వ్యక్తి తీవ్ర గాయాలపాలై కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ఇది రోడ్డు ప్రమాదమా.. ఎవరైనా దాడి చేసి అక్కడ పడేసి వెళ్లారా అనే అనుమానాలు బంధువులు వ్యక్తం చేస్తున్నారు. వివరాలలోకి వెళితే.. చక్రాయపేట మండలం మారెళ్లమడక గ్రామానికి చెందిన డి.వెంకటసుబ్బారెడ్డి వేంపల్లె శ్రీచైతన్య హైస్కూలు సమీపంలో నివాసముంటున్నారు. మంగళవారం సాయంత్రం పులివెందుల – కడప బైపాస్ రోడ్డులో మోటారు బైకు మీద వెళుతుండగా తీవ్ర గాయాలయ్యాయి. తలకు బలమైన గాయాలు కావడంతో స్థానికులు వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చి బంధువులకు సమాచారం అందించారు. అయితే ప్రమాదం జరిగిన తీరు చూస్తే బైకు ఒక చోట.. గాయపడిన వెంకటసుబ్బారెడ్డి మరోచోట పడి ఉండటంవల్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారా.. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిందా అనేది స్పష్టంగా తెలియడంలేదు. గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని మృతుని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.