
రెండు రాష్ట్రాలకు ఒకే ఈ-పాస్ సర్వర్‌తో ఇక్కట్లు
♦ రీయింబర్స్‌మెంట్ దరఖాస్తుల రిజిస్ట్రేషన్‌లో సమస్య
♦ నేటితో ముగుస్తున్న గడువు
♦ మరోసారి పొడిగించాలంటున్న కాలేజీలు, విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నమ్ముకుని ఉన్నతవిద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా 2014-15, 2015-16కు సంబంధించి రెన్యూవల్, ఫ్రెష్ దరఖాస్తుల రిజిస్ట్రేషన్ల సందర్భంగా ఈ-పాస్‌లో నమోదు చేసుకోవడంలో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ రెండు రాష్ట్రాలకు కలిపి ఒకటే ఈ-పాస్ సర్వర్ ద్వారా విద్యార్థులంతా దరఖాస్తు చేసుకుంటున్నారు. దీంతో ఒక్కసారిగా దరఖాస్తులు వెల్లువెత్తడంతో ధ్రువపత్రాలన్నింటినీ ఈ-పాస్ వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేసుకోవడంలో సమస్యలు ఎదురవుతున్నాయి.
దీనివల్ల తాము తుది గడువు లోగా రిజిస్టర్ చేసుకోలేకపోయామని, ఈ తేదీని మరోసారి పొడిగించాలని పెద్దసంఖ్యలో కాలేజీలు, విద్యార్థులు కోరడంతో ఇదివరకే ఓ సారి గడువు పొడిగించారు. తాజాగా మళ్లీ ఆదివారంతో 2014-15, 15-16కు సంబంధించిన రిజిస్ట్రేషన్ల గడువు ముగుస్తుండటంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ఈ-పాస్ వెబ్‌సైట్ వేగం మందగించిందని, తమ సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయలేకపోతున్నామని, కాలేజీల వివరాలు డిస్‌ప్లే కావడం లేదంటూ పలువురు విద్యార్థులు కొన్నిరోజులుగా సంక్షేమభవన్ చుట్టూ తిరుగుతున్నారు.
తెలంగాణ, ఏపీలకు విడివిడిగా 2 సర్వర్లను ఏర్పాటు చేస్తేనే ఈ సమస్య తీరుతుందని వివిధ సంక్షేమశాఖల అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఫ్రెష్, రెన్యూవల్ దరఖాస్తులను నమోదు చేసుకోలేదు. అంతేకాదు కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల్ని పొందడంలోనూ విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. 14 లక్షల పైచిలుకు విద్యార్థులకు ఇప్పటివరకు 2015-16కు సంబంధించి 8.40 లక్షల విద్యార్థులే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 2014-15కు సంబంధించి దాదాపు 50 వేల నుంచి లక్ష మంది వరకు ఇంకా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో గత, ప్రస్తుత సంవత్సరాలకు దరఖాస్తుల తుదిగడువును ఈ నెలాఖరు వరకు లేదా వచ్చేనెల 15 వరకు పొడిగించాలని సంబంధిత శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఒకటి, రెండురోజుల్లో ఉత్తర్వులు వెలువడవచ్చునని తెలుస్తోంది.
శాచ్యురేషన్ పద్ధతి ఉన్నట్లా లేనట్లా...!
ప్రస్తుతం వివిధ సంక్షేమశాఖల ద్వారా అమలు చేస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అర్హులైన విద్యార్థులందరికీ అందించేలా సంతృప్తస్థాయి (శాచ్యురేషన్)ని పాటిస్తారా లేదా అన్న అనుమానాలు ఆయా వర్గాల విద్యార్థుల్లో వ్యక్తమవుతున్నాయి. దీంతో అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగ విద్యార్థులందరికీ ప్రయోజనం కలిగేలా చూడాలని విజ్ఞప్తులు వస్తున్నాయి. శాచ్యురేషన్ పద్ధతిని అమలు చేసేట్లయితే అర్హులైన లబ్ధిదారుల వివరాలే ఈ-పాస్‌లో నమోదవుతాయి కాబట్టి, గడువు విధించకుండా, కొంత మినహాయింపునిస్తే తమకు సులువుగా ఉంటుందని కూడా ఆయా వర్గాల విద్యార్థులు కోరుతున్నారు.