
ప్రైవేటు సీటు.. భారీ రేటు!!
ప్రైవేటు పాఠశాలల ఫీజులు రెట్టింపయ్యాయి. టెక్నో, ఈ-టెక్నో, ఒలంపియాడ్, స్మార్ట్ లాంటి పేర్లను.....
►ఇళ్లిళ్లూ తిరుగుతున్న ప్రైవేటు స్కూళ్ల సిబ్బంది
►సౌకర్యాలు, వసతుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులకు గాలం
►అడ్మిషన్‌లు పెంచుకోవడమే లక్ష్యంగా ్రప్రచారం
►టెక్నో, ఈ-టెక్నో, ఒలంపియాడ్ పేర్లు తీసేసినా
►భారీగా ఫీజులు వసూలు
►కనీస విద్యార్హత లేని టీచర్లతో బోధన
► చాలా పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కరువు
సాక్షిప్రతినిధి, అనంతపురం ప్రైవేటు పాఠశాలల ఫీజులు రెట్టింపయ్యాయి. టెక్నో, ఈ-టెక్నో, ఒలంపియాడ్, స్మార్ట్ లాంటి పేర్లను రెండేళ్ల కిందట తొలగించినా ఫీజుల్లో మాత్రం ఎలాంటి తేడా లేదు. మరో వారం రోజుల్లో ప్రైవేటు పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో అడ్మిషన్ల ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఎలాగైనా సరే పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచుకునేందుకు ప్రైవేటు స్కూళ్ల సిబ్బంది పిల్లల కోసం వీధివీధీ, ఇళ్లిళ్లూ తిరుగుతూ అడ్మిషన్ల ప్రక్రియలో తలమునకలవుతున్నాయి. ఈ క్రమంలో అధికారులు ఏమాత్రం ఏమరపాటు వహించినా పిల్లలు లేరనే సాకుతో మరోసారి సర్కారుబళ్లు మూతపడే ప్రమాదముంది.
స్కూల్ ప్రచారంలో టీచర్లు
ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ ఇటు ప్రైవేటు పాఠశాలలతో పాటు ప్రభుత్వ పాఠశాలలకు కత్తిమీదసాముగా మారింది. మరో వారంలో ప్రైవేటు పాఠశాలలు...ఆపై వారం తర్వాత సర్కారు పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి, ఈ క్రమంలో ప్రైవేటు స్కూళ్ల నిర్వాహకులు అడ్మిషన్లపై దృష్టి సారించారు. విద్యాసంస్థల్లోని టీచర్లు గ్రూపులుగా ఏర్పడి రాజకీయ ప్రచారాన్ని తలపించేలా ఇళ్లిళ్లూ చుట్టేస్తున్నారు. తమ పాఠశాలలోని ప్రత్యేకతలను గొప్పగా చెబుతున్నారు. విద్యార్థులను రప్పించడమే ధ్యేయంగా టీచర్లు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. పైగా ఒక్కో టీచరు కనీసం పదిమంది విద్యార్థులనైనా చేర్పించాలని యాజమాన్యాలు హుకుం జారీ చేయడం, ఎక్కువ మందిని చేర్పిస్తే మంచి వేతనాలు ఇస్తామని హామీలు ఇవ్వడంతో వారు ప్రచారంలో దూసుకుపోతున్నారు. పేరొందిన రెండు ప్రముఖ కార్పొరేట్ స్కూళ్లలో సీట్లు అయిపోయాయని చెబుతూ డిమాండ్ పెంచి ఫీజులు పెంచుతున్నారు. విధిలేక తల్లిదండ్రులు కూడా అడిగినంత చెల్లిస్తున్నారు.
భారీగా ఫీజులు
విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైైవేటు పాఠశాలల్లో విద్యాశాఖ నిర్ణయించిన మేరకే ఫీజులు వసూలు చేయాలి. కానీ జిల్లాలో ఇది చాలా స్కూళ్లలో అమలు కావడం లేదు. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ స్థాయి నుంచే భారీగా ఫీజులు గుంజుతున్నారు. విద్యాబోధనతో పాటు ఐఐటీ కోచింగ్, అబాకస్, స్పోకెన్ ఇంగ్లిష్, కరాటే, డ్రాయింగ్, బాక్సింగ్, ఇతర టాలెంట్ టెస్టులు నిర్వహిస్తున్నామంటూ పలు రకాల ఫీజులతో పేరుతో భారీగా వసూళ్లు చేస్తున్నారు. వీటికి తోడు పాఠశాలల్లోనే యూనిఫాంలు, పుస్తకాలు, నోట్‌బుక్స్, బూట్లు, సాక్సులు టై అంటూ ఇష్టమెచ్చిన ధరలను యాజమాన్యాలే నిర్ణయించి, తప్పనిసరిగా వారి వద్దనే తీసుకోవాలంటూ నిబంధన విధిస్తున్నారు. దీంతో ఫీజులతో పాటు వీటి భారం కూడా తల్లిదండ్రులపై పడుతోంది. ఎల్‌కేజీ విద్యార్థికే ఏడాదికి 25 వేల రూపాయలు ఖర్చవుతోంది. 5-10 తరగతి వరకైతే స్కూళ్లను బట్టి 30-70వేల రూపాయల వరకు ఖర్చవుతోంది. వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నా, కనీస సౌకర్యాలు కల్పించడంలో కొన్ని సూళ్లు విఫలమవుతున్నాయి.
నిబంధనలకు విరుద్ధం:
విద్యాహక్కు చట్టం ప్రకారం ఓ పాఠశాల నుంచి మరో పాఠశాలలో చేరే విద్యార్థుకు ప్రవేశ పరీక్ష పెట్టరాదు. కానీ చాలా స్కూళ్లు ప్రవేశపరీక్ష ద్వారా అడ్మిషన్లు నిర్వహిస్తున్నాయి. దీంతో సీటు రాని విద్యార్థులు చిన్న వయస్సులోనే మానసికగా కుంగిపోయి చదువుపై ఏకాగ్రత సాధించలేకపోతున్నారు. పైగా అర్హత లేని టీచర్లతో బోధన చేయిస్తున్నారు. వీటిపై అధికారులు దృష్టి సారించడం లేదు.
ప్రైవేటు పాఠశాలలు ఇంటింటికీ వచ్చి గద్దల్లా పిల్లలను ఎగరేసుకుపోవడం, ప్రైవేటు వేగాన్ని ప్రభుత్వాధికారులు అందుకోకపోవడంతో ఏటేటా సర్కారు స్కూళ్లలో పిల్లల సంఖ్య క్షీణిస్తోంది. పిల్లలు తక్కువగా ఉన్నారనే సాకుతో ఇప్పటికే దాదాపు 179 ప్రాథమిక, 225 ప్రాథమికోన్నత పాఠశాలలను జిల్లాలో మూసేశారు. ఈ క్రమంలో పిల్లల సంఖ్యను అధికారులు పెంచకపోతే మరిన్ని పాఠశాలలు మూతపడే ప్రమాదముంది.