
భార్యాపిల్లలు ఇంట్లోనే బైట దొంగలు
సాక్షి, భాగ్యనగర్ కాలనీ: తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని అపార్టుమెంట్‌లో మూడు ఫ్లాట్‌లతో పాటు పక్కనే ఉన్న మరో అపార్టుమెంట్‌లోనూ దొంగతనాలకు పాల్పడిన సంఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం కలకలం సృష్టించింది. సీఐ పురుషోత్తమ్ యాదవ్, బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బాలాజీ నగర్‌లోని శ్రీ వెంకటరామ అపార్టుమెంట్స్‌లో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు చొరబడి నాలుగో అంతస్తులోని రెండు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు.
404 ఫ్లాట్‌లో నివాసముంటున్న గణేష్‌వర్మ తన బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లడంతో ఇంటి గడియ పగులగొట్టిన దొంగలు బీరువాలో ఉన్న రూ. 10 వేల నగదు, ల్యాప్‌టాప్, బంగారు వస్తువులు ఎత్తుకెళ్లారు. 405 ఫ్లాటు తాళాలు పగలగొట్టినా అది ఆఫీసు కావటంతో ఎలాంటి వస్తువులు దొరకక పోవటంతో వెనుదిరిగారు. అనంతరం పొరుగునే ఉన్న శ్రీ సాయి నిలయం అపార్టుమెంట్‌లో మొదటి ఫ్లోర్‌లోని సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉద్యోగి వీరన్‌చౌదరి తమ బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళుతూ భార్య రమ్య, కుమార్తెలను ఇంట్లోనే ఉంచి బయట తాళం వేసుకుని వెళ్లాడు.
సదరు ఇంటి తాళం పగలగొట్టిన దొంగలు బీరువాలో ఉన్న రెండు నల్లపూసల గొలుసులు, హారం, నెక్లెస్, డైమండ్ రింగ్‌లను దోచుకున్నారు. అలికిడికి నిద్రలేచిన రమ్య దొంగలను గుర్తించి కేకలు వేయడంతో వారు రాళ్లతో ఆమెపై దాడి చేయడమేగాక, మెళ్లో ఉన్న గొలుసు, చేతి గాజులను లాక్కెళ్లారు. కూకట్‌పల్లి పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకొని ఆధారాలను సేకరించారు. వెంకటరామ అపార్టుమెంట్‌లోని సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించగా ఆరుగురు వ్యక్తులు చోరీలో పాల్గొన్నట్లు గుర్తించామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.