ఆ లేఖ అసలుదా.. నకిలీదా! | The sensation creates a yakaiah shooting event | Sakshi
Sakshi News home page

ఆ లేఖ అసలుదా.. నకిలీదా!

Published Fri, Jun 30 2017 11:33 AM | Last Updated on Mon, Oct 8 2018 5:19 PM

ఆ లేఖ అసలుదా.. నకిలీదా! - Sakshi

ఆ లేఖ అసలుదా.. నకిలీదా!

► సంచలనం సృష్టించిన కాల్చివేత ఘటన
► యాకయ్యను హత్య చేసింది మావోయిస్టులేనా?
► రంగంలోకి దిగిన జిల్లా ఎస్పీ కోటిరెడ్డి  వ్యక్తిగత కక్షలతో
► హత్య చేసినట్లు అనుమానాలు


సాక్షి, మహబూబాబాద్‌: దంతాలపల్లి మండలం కుమ్మరికుంట గ్రామంలో బుధవారం రాత్రి కొంపెల్లి యాకయ్య(32)ను తుపాకీతో కాల్చి చంపడం, అతడి జేబులో సీపీఐ(ఎంఎల్‌) పేరిట లేఖ దొరకడం జిల్లాలో సంచలనం సృష్టించింది. మహిళలను వేధించడం, సెటిల్‌మెంట్లు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుండడం వల్లే కాల్చి చంపామని, మహిళలపై అరాచకాలకు పాల్పడితే ఇదే శిక్ష అంటూ హెచ్చరించడం కలకలం సృష్టించింది. జిల్లాలో మావోయిస్టుల కదలికలు లేవని, రాష్ట్రంలోకి ప్రవేశించలేరని రాష్ట్ర పోలీస్‌శాఖ ప్రకటించిన నేపథ్యంలో, సీపీఎం(ఎంఎల్‌)పేర యాకయ్య హత్యగావించబడడంతో మావో యిస్టులు, మావోయిస్టుల కదలికలు ఉన్నాయా, సీపీఐ(ఎంఎల్‌) అనే కొత్త గ్రూపు ఏదైనా ఏర్పాటైందా! అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

అయితే, బుధవారం రాత్రే యాకయ్య హత్యకు గురైనప్పటికీ, గురువారం మధ్యాహ్నం వరకు పోలీసులు హత్యగా గుర్తించలేదు. అతడు కింద పడి చనిపోయి ఉంటాడని భావించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కుటుంబసభ్యులకు యాకయ్య జేబులో లేఖ దొరకడంతో, పోలీసులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. వెంటనే జిల్లా ఎస్పీ ఎన్‌.కోటిరెడ్డి రంగంలోకి విచారణను ప్రారంభించారు. పోస్టుమార్టం చేసిన వైద్యులు యాకయ్య తలలో నుంచి బుల్లెట్‌ను వెలికితీయడం పోలీస్‌ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

నక్సల్స్‌ గ్రూపుల్లోనూ గందరగోళం
ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో చీలికల తర్వాత ఆ పార్టీ సీపీఐ, సీపీఎంతోపాటు సీపీఐ(ఎంఎల్‌)లుగా ఏర్పడ్డాయి. అనంతరం సీపీఐఎంఎల్‌ పార్టీలో ఏర్పడిన పలు చీలికలతో పీపుల్స్‌వార్, విమోచన, జనశక్తి, ప్రతిఘటన, ప్రజాపంధా, ప్రజాప్రతిఘటన పార్టీలుగా ఆవిర్భవించాయి. ప్రస్తుతం జిల్లాలో న్యూడెమోక్రసీలోని చంద్రన్న, రాయల వర్గాలు మాత్రమే అజ్ఞాత దళాలతోపాటు లీగల్‌ నాయకత్వంతో కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. మావోయిస్టు పార్టీ పేరున గత ఐదునెలల క్రితం మహబూబాబాద్‌లో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఉన్నతస్థాయి అధికారిని హెచ్చరిస్తూ పోస్టర్లు అతికించినప్పటికీ, ఆ తర్వాత ఆ పార్టీ కార్యకలాపాలు జిల్లాలో లేవని చెప్పవచ్చు. ఈ క్రమంలో యాకయ్యను తుపాకీ కాల్చి చంపి, సీపీఐ(ఎంఎల్‌) మార్క్సిస్టు–లెనినిస్టు పార్టీ సూర్యాపేట, నల్గొండ జిల్లా కమిటీ కార్యదర్శి జగదీష్‌ పేరిట లేఖను వదిలి వెళ్లడం ఇటు జిల్లాలోనూ, అటూ విప్లవ పార్టీల సానుభూతి పరుల్లోనూ గందరగోళానికి గురిచేస్తోంది.

కొత్త దళమా.. మాజీలా?
హత్యకు గురైన యాకయ్య తలలో బుల్లెట్‌ దొరకడం, జేబులో సీపీఐ(ఎంఎల్‌) సూర్యాపేట–నల్లగొండ కమిటీ పేరిట లేఖ దొరకడంతో మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల సరిహద్దులో కొత్త దళం ఏర్పడిందా లేక ఆ దళం పేరుతో మాజీ నక్సల్స్‌ ఆయుధాన్ని ఉపయోగించి హత్య చేశారా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మైదాన ప్రాంతంగా ఉండే దంతాలపల్లి, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, మద్దిరాల మండలాల సరిహద్దులో మావోయిస్టు దళం సంచరించే అవకాశాలు లేకపోవడంతో ఈ హత్యను ఇంకెవరైనా చేశారా అనే సందేహలు వ్యక్తమవుతున్నాయి.

హెచ్చరికలు లేకుండా హత్య చేస్తారా?
మావోయిస్టు దళాలు ఎవరినైనా టార్గెట్‌ చేసినప్పుడు ముందస్తుగా అతడి ప్రవర్తనను మార్చుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తాయి. ఓ పార్టీ తమ టార్గెట్‌కు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండా హతమార్చటం నమ్మదగ్గ విషయం కాదని గతంలో విప్లవ పార్టీలో పనిచేసిన మాజీలు పేర్కొంటున్నారు.

వేగవంతమైన విచారణ
యాకయ్య హత్య ఘటనను జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఘటన స్థలాన్ని పరిశీలించారు. అక్కడున్న వారిని విచారించారు. గురువారం అర్ధరాత్రి వరకు తొర్రూరులోనే ఎస్పీ ఉండి స్వయంగా విచారణ చేస్తుండడం గమనార్హం.
అనుమానాస్పద

మృతిగా కేసు నమోదు
దంతాలపల్లి(డోర్నకల్‌): మండలంలోని కుమ్మరికుంట గ్రామంలో కొంపెల్లి యాకయ్య(32) మృతిచెందగా, కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. యాకయ్య మృతిచెందిన స్థలాన్ని ఎస్పీ పరిశీలించారు. అనంతరం మృతుడు బుధవారం రాత్రి మద్యం తాగిన బెల్టుషాపు నిర్వాహకురాలు ధనమ్మ, అతడి వెంట వచ్చిన గ్రామస్తుడు శంకర్‌ను ఆరా తీశారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రేపోణి గ్రామానికి చెందిన కొంపెల్లి యాకయ్య హత్యకు గురైనట్లు ప్రాథమిక నిర్దారణకు వచ్చామని తెలిపారు.

కాగా మృతదేహం వద్ద సూర్యపేట, నల్గొండ ఉమ్మడి జిల్లాలకు చెందిన సీపీఐ(ఎంఎల్‌) కార్యదర్శి జగదీష్‌ పేరుతో ఓ లేఖ ఉందని పేర్కొన్నారు. మహబూబాబాద్‌ జిల్లాలో మావోయిస్టుల ప్రభావం లేదని, లేఖలో సూర్యపేట, నల్గొండ ఉమ్మడి జిల్లాల పేరిట ఉందని తెలిపారు. మృతుడి జేబులో లేఖ లభించిందని, ఎవరైనా పాతకక్షలతో హత్య చేసి లేఖను జేబులో ఉంచారా అనే కోణాల్లో విచారణ చేస్తున్నామని వివరించారు. ఇదిలా ఉండగా బెల్టుషాపు నిర్వాహకురాలు ధనమ్మ, గ్రామస్తుడు శంకర్‌ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.

మూడు దశాబ్దాల తర్వాత పేలిన తూటా
దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్లలో కొంపెల్లి యాకయ్యను తుపాకీతో కాల్చిచంపడంతో మండలంలో మూడు దశాబ్దాల తర్వాత తూటా పేలినట్టయ్యింది. మండలంలోని పెద్దముప్పారం గ్రామంలో 1970 మధ్య కాలంలో నారాయణరెడ్డి అనే వ్యక్తిని రెడ్‌బ్లాక్‌ (ఆర్‌ఓసీ) కమ్యూనిస్టు పార్టీకి చెందిన తొంట మల్లయ్య అనే సభ్యుడు కాల్చిచంపాడు. తిరిగి 1974లో కోటగిరి వెంకటయ్య, పెండ్లి శంకరయ్యను పోలీసుల ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. ఆ తర్వాత 1978లో గొడిశాల మల్లయ్య పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు. తిరిగి మూడు దశాబ్దాల తర్వాత కమ్యూనిస్టు పార్టీ పేరుతో అక్రమాలు, వేధింపులకు పాల్పడుతున్నాడని సీపీఐ(ఎంఎల్‌) పేరుతో యాకయ్యను కాల్చిచంపడంతో మండలం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

జులాయిగా జీవితం
యాకయ్య ఇంటర్‌ దశలోనే చదువును ఆపేసి జులాయిగా తిరిగేవాడు. అతడికి ఖమ్మం జిల్లాకు చెందిన యువతితో వివాహం జరిగింది. వీరి ఒక కుమారుడు ఉన్నారు. అయితే యాకయ్యకు గతంలో నేర చరిత్ర ఉంది. భార్య ఇదే గ్రామానికి చెందిన కొప్పుల విజయ్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం సాగిస్తోందనే అనుమానంతో అతడు నిద్రిస్తుండగా 2015లో గొడ్డలితో నరికి హత్య చేశాడు. అప్పటి నుంచి భార్యతో కొడుకుతో సహ పుట్టింటికి వెళ్లి అక్కడే ఉంటోంది. ఈ హత్యను అవకాశంగా మలుచుకున్న యాకయ్య పలు కుటుంబ వివాదాలు, భూవివాదాల్లో తలదూర్చడం, సెటిల్‌మెంట్లు చేస్తూ డబ్బు సంపాదించేందుకు అలవాటుపడ్డాడు.

ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన తారమ్మ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ప్రస్తుతం ఓ కుమారుడు, ఓ కుమార్తె జన్మించారు. ఇటీవల కుమారుడు అనారోగ్యంతో మృతిచెందాడు. యాకయ్య పలువురు మహిళలను, యువతులను వేధింపులకు గురిచేస్తున్నాడనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ఈ క్రమంలో రెండు నెలల క్రితం ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించడంగా యాకయ్యను కొట్టి పోలీసులకు అప్పగించారు. పోలీసులు క్షమాపణ చెప్పించి, కౌన్సెలింగ్‌ చేసి వదిలేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement