
వరద కాలువ టెండర్లలో మంత్రి వాటా రూ.7 కోట్లు
– ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆరోపణ
కడప కార్పొరేషన్: కుందూ–పెన్నా వరద కాలువ నిర్మాణంలో రాష్ట్ర ఇరిగేషన్ శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వర్‌రావుకు భాగస్వామ్యం ఉందని, రూ.7కోట్లు చెల్లించేలా ఒప్పందం కూడా కుదిరిందని ప్రొద్దుటూరు శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఇక్కడి వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, కమలాపురం, కడప ఎమ్మెల్యేలు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, ఎస్‌బి అంజద్‌బాషా, మేయర్ సురేష్‌బాబు, జెడ్పీ వైస్ ఛైర్మెన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిలతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ప్రజల దాహార్తిని తీర్చడానికి దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2007లో రూ.72 కోట్లతో చేపట్టిన వరద కాలువ నిర్మాణాన్ని మాజీ ఎమ్మెల్యే వరద రాజులరెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. తద్వారా గత ఎన్నికల్లో తాను పోగొట్టుకున్న డబ్బును తిరిగి రాబట్టుకోవడానికి, వచ్చే ఎన్నికలకు మళ్లీ సన్నద్ధం కావడానికి ఈ కాలువ పనులను వినియోగించుకుంటున్నారని విమర్శించారు. వరద కాలువ మొత్తం 23 కి.మీలు ఉండగా, కోర్టులో కేసులతో 6 కి.మీలు భూసేకరణ జరగలేదన్నారు. అయినా సరే ఇరిగేషన్ అధికారులు ఈ పనికి టెండర్లు పిలిచారన్నారు. మాజీ ఎమ్మెల్యే కోసమే ఇష్టానుసారంగా నిబంధనలు రూపొందించారన్నారు. చివరకు ఆ నిబంధనలతో తాము కూడా క్వాలిఫై కాలేమని లె లుసుకొని చివరి నిమిషంలో వాటిని రద్దు చేయించారని ధ్వజమెత్తారు. ప్రజా ధనాన్ని అప్పనంగా దోచుకోవడానికే రూ.72కోట్ల పనిని రివైజ్ ఎస్టిమేషన్స్ పేరుతో రూ.112.63 కోట్లకు పెంచారని ఆరోపించారు. ఇందులో మంత్రి దేవినేని సంపూర్ణంగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ టెండర్లు ఖరారు కాగానే రూ.7 కోట్లు మంత్రికి చెల్లించేలా రహస్య ఒప్పందం కుదిరిందన్నారు. ప్రొద్దుటూరుకు నీళ్లు తేకుండా ప్రజాధనాన్ని వాటాలుగా పంచుకొనే ఈ అడ్డగోలు పనులకు పుల్‌స్టాప్ పెట్టకపోతే తమ ఎమ్మెల్యేలందరితో కలిసి మంత్రి దేవినేని ఛాంబర్ ఎదుటే నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. తద్వారా రాష్ట్రమంతా వీరి అవినీతి భాగోతాన్ని ఎలుగెత్తి చాటుతామని స్పష్టం చేశారు.