లేపాక్షి : స్థానిక ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు మేనేజరు, అసిస్టెంట్ మేనేజర్లపై ఎన్‌ఎస్‌ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు తులసీనాయక్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు పత్రాన్ని సోమవారం ‘మీ కోసం’లో తహశీల్దార్ ఆనంద్‌కుమార్‌కు అందజేశారు. ఆ మేరకు వివరాలు... ఈనెల 2వ తేదీ డబ్బులు డ్రా చేసుకోడానికి తులసీనాయక్ బ్యాంకుకు వెళ్లారు. ఇంటి అవసరాలకు ఏ మాత్రం డబ్బుల్లేవని, నిబంధనల మేరకు రూ.4వేలు నగదు ఇవ్వాలని అక్కడి అధికారులకు విన్నవించుకున్నారు. అయినప్పటికీ వారు కనికరం చూపకుండా బ్యాంకులో డబ్బుల్లేవని చెప్పారు. వెనుదిరిగి వెళ్తుండగా.. తనకన్నా వెనుక వచ్చిన వారు డబ్బులు తీసుకెళ్లిపోవడం చూశారు. అదేమని అడిగితే తన ఇష్టం వచ్చిన వారికి ఇస్తానని, అడగడానికి మీరెవరని బ్యాంకు మేనేజరు పదిమందిలో అవమాపరిచేలా మాట్లాడారు. కావాలంటే నీ అకౌంటు ఇక్కడ తీసేసుకుని ఇంకోచోట చేసుకోమన్నారు. అందరూ గౌరవించే ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న తులసీనాయక్ దీన్ని జీర్ణించుకోలేకపోయారు. మూడురోజులు గడిచినా ఆ బాధ తగ్గకపోవడంతో అలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ‘మీ కోసం’ ద్వారా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మీ కోసం కార్యక్రమంలో మరో 13 ఫిర్యాదులు అందినట్లు తహశీల్దార్ ఆనందకుమార్ తెలిపారు. ఇళ్లకు సంబంధించి 7, రేషన్‌కార్డులపై 6 ఫిర్యాదులు వచ్చాయన్నారు.