
కరెంట్ షాక్‌తో యువరైతు మృతి
కన్‌సాన్‌పల్లిలో విషాద ఛాయలు
జోగిపేట(అందోలు): అందోలు మండలం కన్‌సాన్‌పల్లి గ్రామంలో కరెంట్ షాక్‌తో యువరైతు అశోక్ (32) మృతి చెందిన సంఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మృతుడు తనకున్న పాత బోరులో భూగర్భ జలాలు తగ్గిపోవడంతో ఇటీవల కొత్త బోరును వేయించుకున్నాడు. అందులో నీరు పడడంతో మోటార్‌కు పాత బోరు కనెక్షన్‌ను ఇచ్చేందుకు చేసే ప్రయత్నంలో కరెంట్‌షాక్‌కు గురైనట్లు ఎస్‌ఐ–2 లింబాద్రి తెలిపారు.
స్తంభానికి ఉన్న విద్యుత్ కనెక్షన్‌ను తొలగించకుండా మోటార్ కనెక్షన్‌ను తీసి వైరును ఒక్కచోటకు తెచ్చేందుకు చుట్టుకుంటూ వెళుతున్నాడు. ఈ క్రమంలో సర్వీస్ వైరు తెగి ఉండడంతో అక్కడే కరెంట్‌షాక్ బలంగా కొట్టింది. దీంతో అశోక్ అక్కడే కుప్పకూలి పడిపోయినట్లుగా తెలిపారు. జోగిపేట ఆసుపత్రికి తరలించగా చనిపోయినట్లు ధ్రువీకరించారు.
వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న అశోక్‌కు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. అశోక్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహానికి జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.