తాళం వేసిన ఇంట్లో చోరీ
-
మూడు సవర్లు బంగారు ఆభరణాల అపహరణ
-
అన్నం వండుకుని తిని తీరిగ్గా చోరీ
వెంకటగిరి:
బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లిన ఓ కుటుంబం తిరిగి వచ్చేలోగా దొంగలు ఇల్లును దోచేశారు. చోరీకి వచ్చిన గుర్తుతెలియని దుండగులు వంటి గది తాళం పగలగొట్టి అన్నం వండుకుని తిని చోరీకి పాల్పడడం బాధితులతో పాటు స్థానికులు విస్తుబోయారు. వెంకటగిరి పట్టణం కాలేజీమిట్టలో శనివారం ఈ విషయం వెలుగు చూసింది. బాధితుల కథనం ప్రకారం.. కాలేజీమిట్టకు చెందిన నరేష్, ప్రవళిక దంపతులు గూడూరు రూరల్ మండలం నెర్నూరు గొల్లపల్లిలో బంధువుల పెళ్లికి హజరయ్యేందుకు ఇంటికి తాళం వేసుకుని నాలుగు రోజుల క్రితం వెళ్లారు. శనివారం సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చే సరికి ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తలుపునకు వేసిన తాళంతోపాటు ఇంట్లో బీరువా, బీరువాకు ఉన్న లాకర్ తాళాలు పగలగొట్టి లాకర్‌లో ఉన్న రెండు సవర్లు బంగారుచైన్, 6 గ్రాముల ఉంగరం అపహరించుకుపోయినట్లు గుర్తించారు. వీటి విలువు సుమారు రూ.80 వేలు ఉంటుందని బాధితుల అంచనా. ఎస్సై ఆంజనేయరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం ద్వారా ఆధారాలు సేకరిస్తామని తెలియజేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఎన్‌జీఓ కాలనీలో మరోఇంట్లో..
పట్టణంలోని ఎన్‌జీఓ కాలనీకి చెందిన సుగుణ తన ఇంటికి తాళం వేసుకుని పిల్లలతో కలిసి శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌కు వెళ్లింది. భర్త సురేష్ ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉండడం, వరుసగా రెండు రోజులు సెలవుల రావడంతో సుగుణ భర్త వద్దకు Ðð ళుతూ సమీపంలోని బంధువులకు ఇల్లు చూస్తుండమని చెప్పి వెళ్లింది. అయితే శనివారం ఉదయం బంధువులు సుగుణ ఇంటికి వెళ్లి చూడగా ఇంటికి వేసినతాళంతో పాటు బీరువా తాళం పగలగొట్టి ఉండడం గమనించి సుగుణకు సమాచారం ఇచ్చారు. ఆమె వస్తేగాని ఎంత మొత్తం చోరీకి గురైందో తెలియదని బంధువులు చెబుతున్నారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.