సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. లక్ష్యాలను విధించుకున్నప్పటికీ ఏ ప్రాజెక్టు కూడా సకాలంలో పూర్తయ్యే సూచనలు కన్పించడం లేదు. బల్దియా పాలకమండలి ఎన్నికల్లో నగరమంతా పర్యటించి...పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించిన మునిసిపల్ మంత్రి కె.తారకరామారావు నగరానికి సంబంధించిన ప్రాజెక్టుల పురోగతిలో, నగర సమస్యల పరిష్కారంలో కొంత వెనుకబడినట్లుగా విమర్శలు విన్పిస్తున్నాయి.
నగర సమస్యలన్నీ ఆకళింపు చేసుకున్న ఆయన నిర్ణీత వ్యవధిలో, నెలనెలా రివ్యూలతో పనులు పూర్తిచేస్తానన్నప్పటికీ సాధ్యం కావడం లేదు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా ప్రకటించిన వివిధ పనులను గత జూన్ 2 నాటికే పూర్తిచేయాల్సి ఉన్నప్పటికీ, మరో రెండొందల రోజులవుతున్నా అవి పూర్తి కాలేదు. గత ఐదారునెలలుగా గ్రేటర్‌లోని జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, జలమండలి తదితర శాఖల ఉన్నతాధికారులతో తరచూ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నా..అందులో తీసుకున్న lనిర్ణయాల అమలులో అనుకున్నంత వేగం కన్పించడం లేదు.
రోడ్లు, నాలాల సమస్యలపై తరచూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా చెప్పుకోదగ్గ ఫలితం కనిపించడం లేదు.చేసే పనులనే చెబుతామని, ఏనెల ఏవి చేస్తామో కూడా క్యాలెండర్ నిర్వహిస్తామన్నప్పటికీ అమలవుతున్న దాఖాలాల్లేవు. మొత్తానికి సమావేశాలు, సమీక్షలు జరుగుతున్నా తాము ఆశించిన అభివృద్ధి మాత్రం కనిపించడం లేదని నగర ప్రజలు అంటున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్‌లోని వివిధ కార్యక్రమాల తీరుతెన్నులపై సింహావలోకనం...
నాలాలు, చెరువులు..
ఇటీవల వర్షాలతో నగరం నీట మునిగినప్పుడు నాలాలపై వెలసిన అక్రమాలను తొలగించి ఆధునీకరిస్తామన్నారు. అక్టోబరు నెలాఖరుకే సర్వే పూర్తిచేసి, నాలాలకు సంబంధించిన తదుపరి కార్యాచరణను వెల్లడిస్తామన్నా ఇంకా సర్వే పూర్తికాలేదు. 173 ప్రధాన నాలాలకు గాను దాదాపు 100 నాలాల సర్వే పూర్తయింది. 390 కి.మీ.ల మేర సర్వే జరగాల్సి ఉండగా దాదాపు 200 కి.మీ.ల మేర పూర్తయింది. మొత్తం పూర్తయి, ఆక్రమణలు తొలగించి, కిర్లోస్కర్, వాయెంట్స్ సొల్యూష¯Œ్స కమిటీల నివేదికల మేరకు ఆధునీకరించేందుకు ఎన్నేళ్లు పడుతుందో చెప్పలేని పరిస్థితి !
ఆకాశ వంతెనలు..
ఎస్సార్డీపీలో భాగంగా అనేక ప్రాంతాల్లో స్కైవేలు, రహదారుల విస్తరణ తదితర పనులు ప్రకటించినా మైండ్‌స్పేస్, అయ్యప్పసొసైటీల వద్ద కాస్తో కూస్తో కదలిక తప్ప..మిగతా ప్రాంతాల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా ఉంది. కేబీఆర్ చుట్టూ పనులకు ఎ¯ŒSజీటీ స్టే ఆటంకంగా ఉన్నప్పటికీ, మిగతా ప్రాంతాల్లోనూ పురోగతి లేదు. నిధుల కొరత ఒక కారణమైతే భూసేకరణ కష్టాలు ఇంకోవైపు ఉండటంతో ఎస్సార్‌డీపీలో ప్రగతి కనిపించడం లేదు.
మార్పు కనబడటం లేదు
మూస పద్ధతులు మాని, అవసరమైతే చట్ట సవరణ చేసి సమూల మార్పులు చూపిస్తామన్న ప్రకటనలు కార్యరూపం దాల్చుతున్న జాడల్లేవు. ఇంకా పలు పనులు, ప్రాజెక్టుల పరిస్థితి ఇలాగే ఉంది. ఇందుకు కారణాలేమిలో విశ్లేషించుకొని, ఇకనైనా వీటిని అమలు చేస్తే మంచిదని ప్రజలు భావిస్తున్నారు. నేడు ప్రభుత్వవిభాగాలతో పాటు ప్రజాప్రతినిధులు సైతం హాజరవనున్న విస్తృత సమీక్ష సమావేశంలో కొత్త కొత్త నిర్ణయాల కంటే అమలు తీరుకు ఆటంకాలు తెలుసుకొని, పరిష్కరిస్తే మేలని ప్రజలు భావిస్తున్నారు.
రోడ్ల దుస్థితిపై విమర్శల వెల్లువ
ఇక పబ్లిక్ టాయ్‌లెట్లు సమస్యగానే ఉన్నాయి. డిజిటల్ ఇంటినెంబర్లు ఎప్పటికొస్తాయో తెలియకుంది. ఒకసారి వైట్ టాపింగ్ రోడ్లంటారు. మరోమారు అవి ఖర్చెక్కువ కనుక కాంట్రాక్టర్లకే నిర్వహణ బాధ్యతలతో బీటీ రోడ్లంటారు. మళ్లీ వైట్‌టాపింగే శరణ్యమంటారు. ఇలా తడవకో అభిప్రాయంతో రెండు రకాల రోడ్లనూ వేస్తున్నప్పటికీ, ప్రజల కడగండ్లు మాత్రం తీరలేదు. వైట్‌టాపింగ్‌వి చెప్పుకోదగ్గ స్థాయిలో జరగలేదు. ప్రజలకు అవసరం లేని కొన్ని ప్రాంతాల్లో రోడ్లు వేస్తున్నా, అవసరమున్న అనేక ప్రాంతాల్లో వేయడం లేరనే విమర్శలున్నాయి.
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు..
పేదలకు ఈ సంవత్సరం లక్ష ఇళ్లు నిర్మించాలనేది లక్ష్యం. కొన్ని ప్రాంతాల్లో డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లకు పేదలు ముందుకొచ్చినా, వారి పునరావాసం తదితర పనులు జరగాల్సి ఉంది. వివిధ దశల్లో టెండర్లు పిలిచినప్పటికీ, ఇప్పటి వరకు ఐదు ప్రాంతాలకు మాత్రమే టెండర్లు ఖరారయ్యాయి. రెండు ప్రాంతాల్లో మాత్రం స్థానికులను వేరే ఇళ్లలోకి పంపే ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిర్మాణపనులు మాత్రం ఒక్క చోట కూడా ప్రారంభం కాలేదు.ఐడీహెచ్‌కాలనీ తప్ప ఇంకెక్కడా నేటి వరకు ఒక్క ఇల్లు కూడా పూర్తికాలేదు. పెద్ద కాంట్రాక్టర్లు కూడా ముందుకు రాకపోవడంతో జీహెచ్‌ఎంసీలో రిజిస్టరైన స్థానిక కాంట్రాక్టర్లకు సైతం వీటి నిర్మాణ బాధ్యతలప్పగించేందుకు సిద్ధమయ్యారు. చెరువులు, సరస్సుల సుందరీకరణ పనుల్లోనూ చెప్పుకోదగ్గ పురోగతి లేదు. అనేకప్రాంతాల్లో ఫెన్సింగ్ తప్ప జరిగిందేం లేదు.
హుస్సేన్ సాగర్.. మూసీ ప్రక్షాళన
హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, మూసీ సుందరీకరణ పనులు ఎప్పటికవుతాయో చెప్పలేని పరిస్థితి. దుర్గం చెరువుపై కేబుల్ స్టే బ్రిడ్జికి మాత్రం టెండరు పూర్తికావడంతో పనులు మొదలవుతాయనే నమ్మకం కలుగుతోంది.
ఈ సారైనా క్లియర్ అయ్యేనా...
(హెచ్‌ఎండీఏ)
హైదరాబాద్ మెట్రోడెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) కీలక ప్రాజెక్టులకు ఈసారైనా క్లియరెన్స్ లభిస్తుందా అని అధికారులు ఎదురుచూస్తున్నారు. జూలై 26న మంత్రి కేటీఆర్‌తో జరిగిన చివరి సమావేశంలో చర్చకు వచ్చిన ప్రాజెక్టుల్లో ఇప్పటివరకు ఒక్క లాజిస్టిక్ హబ్‌్సకు మాత్రమే ప్రభుత్వం నుంచి పరిపాలన అనుమతులు లభించాయి. మిగతా కీలక ప్రాజెక్టులైన రివైజ్డ్ రింగ్ రోడ్డు, బాలానగర్ ఫ్లైఓవర్, మూసీ రివర్ అండ్ డెవలప్‌మెంట్, ఇకో పార్కు కొత్వాల్ గూడ, ఇంటర్‌సిటీ బస్సు టెర్మినల్ (మియాపూర్), మల్టీలెవల్ కారు పార్కింగ్ (అమీర్‌పేట)లపై చర్చ జరిగినా ఇప్పటివరకు అతీగతీ లేదు. ఈసారైనా కేటీఆర్‌తో జరిగే సమావేశంలో వీటికి ప్రభుత్వం నుంచి పరిపాలన అనుమతులు వస్తాయన్న ఆశతో హెచ్‌ఎండీఏ అధికారులున్నారు.
నేటి సమావేశంలోనైనా స్పష్టత వస్తుందా..? ( జలమండలి)
ప్రధాన నగరానికి రోజూ నీళ్లు...శివారు ప్రాంతాల దాహార్తి తీరుస్తాం...సిటీని మురుగు కష్టాల నుంచి విముక్తి చేస్తాం.. ఇంటింటికీ నల్లా ఏర్పాటు చేస్తాం...పారదర్శకంగా బిల్లులు జారీ చేస్తాం. వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తాం. మూసీనదిని ప్రక్షాళన చేసి మురుగు నుంచి విముక్తి కల్పిస్తాం. జలమండలిపై సమీక్ష జరిపిన ప్రతిసారీ అమాత్యులు చేసే ఈ వాగ్ధానాలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. తాజాగా గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మున్సిపల్ మంత్రి కేటీఆర్ జలమండలి పరిధిలోని మురుగునీటిపారుదల వ్యవస్థ ఆధునికీకరణ, విస్తరణ,నూతన ఎస్టీపీల నిర్మాణం, ప్రస్తుతం ఉన్న వాటి పనితీరు, శివార్లలో రూ.1900 కోట్ల అంచనా వ్యయంతో జరుగుతున్న మంచినీటి సరఫరా పథకం పనులపై సమీక్షించనున్నారు.
గత రెండేళ్లుగా వరుస సమీక్షలు జరిపినప్పటికీ ఆయా అంశాల్లో పెద్దగా పురోగతి కనిపించకపోవడం గమనార్హం. ప్రధానంగా శివారు ప్రాంతాల్లో రూ.2840 కోట్ల అంచనా వ్యయంతో మురుగునీటి పారుదల వ్యవస్థ ఏర్పాటు,రూ.1200 కోట్ల అంచనా వ్యయంతో మూసీ ప్రక్షాళన రెండోదశ పనులు చేపట్టడం,ప్రధాన నగరంలో రూ.400 కోట్ల అంచనా వ్యయంతో మురుగునీటి పైపులైన్ల ఆధునికీకరణపై జలమండలి సిద్ధంచేసిన ప్రతిపాదనలు ఏళ్లుగా నిధుల లేమి కారణంగా కాగితాల్లోనే మగ్గుతున్నాయి. ఈ పథకాలు చేపట్టేందుకు పలు ఆర్థిక సంస్థలు రుణ మంజూరుకు సుముఖంగా ఉన్నప్పటికీ సర్కారు నుంచి ఎలాంటి దిశానిర్దేశం చేయకపోవడంతో ఆయా పనులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. ఈసారైనా వీటిపై స్పష్టత వస్తుందా అన్నది నేటి తాజా సమావేశంతో తేలనుంది.