మంత్రికి అంత మోజెందుకు
► కోష్ట భూములపైనా కన్నేసిన ప్రభుత్వం
► కొవ్వాడ భూసేకరణకు రూ.500 కోట్లు
► ఇవి కేంద్రం నుంచి రావాలంటున్న మంత్రి
ప్రజలు వద్దంటున్నా పర్యావరణానికి ముప్పున్న విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై చంద్రబాబు ప్రభుత్వం అమితాశక్తి చూపుతోంది. జనం ఏమైతే మాకేంటి.. వారి ఆందోళనతో పనేంటి అన్న చందంగా పాలకులు వ్యవహరిస్తున్నారు. అందులోనూ జిల్లాకు చెందిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడే ప్రజల ఆవేదనను కాదని ప్రాణాంతక పరిశ్రమలను ఆహ్వానిస్తూ సాక్షాత్తూ అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఎన్నో ఏళ్లుగా కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రంపై ప్రజల నుంచి వ్యతిరే కత వ్యక్తమవుతుండగా, తాజాగా ‘కోష్ట’ ప్రాంత భూముల్లో మరో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించడంతో ప్రజల్లో మళ్లీ అలజడి మొదలైంది.
శ్రీకాకుళం టౌన్: జిల్లాలో సముద్రతీరం వెంబడి నిర్మించతలపెట్టిన థర్మల్ విద్యుత్‌కేంద్రాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు మొదలై సోంపేటలో ముగ్గురు, కాకరాపల్లిలో మరో ముగ్గురు పోలీసుల తూటాలకు బలయ్యారు. అప్పటి నుంచి జిల్లాలో థర్మల్ కేంద్రాలు ఏర్పాటుకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఆరంభమైంది. అంతకుముందే కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుకు కేంద్రం ముందుకు రావడంతో రణస్థలం ప్రాంతంలో కూడా ఉద్యమాలు మొదలై వ్యతిరేకతను వినిపించారు. అధికారంలోని వస్తే అణువిద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని నిలిపివేస్తామని చంద్రబాబు నాడు ప్రకటించారు. ఇది నమ్మి జనం ఆ పార్టీకి నియోజకవర్గంలో పట్టం కట్టారు. ఇదిలాఉంటే ఇప్పటికే ఆ ప్రాంతంలో ఫార్మా కంపెనీలతో భూగర్భజలాలు కలుషితమై, ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ఈ నియోజకవర్గంలోని కేంద్రం కొవ్వాడ ప్రాంతంలో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటకు చురుగ్గా సన్నాహాలు జరిగిపోతున్నాయి. ప్రజలు వద్దన్నా నిర్మాణం ఆగదని మంత్రులు చెబుతున్న మాటలతో ఈ ప్రాంతంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
కొవ్వాడ అణువిద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు 2074 ఎకరాల భూమిని గుర్తించిన అధికారులు 509 ఎకరాల ప్రైవేట్ భూమిని రైతుల నుంచి స్వీకరించడానికి రూ.500 కోట్లు అవసరం ఉన్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రకటించారు. శాసనమండలిలో ఎంవీవీఎస్ మూర్తి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ రామచంద్రాపురం, టెక్కలి, కోటపాలెం, జీరుకొవ్వాడ, గూడెం, గ్రామాల్లో 7960 కుటుంబాలను నిర్వాసితులుగా గుర్తించామని చెప్పుకొచ్చారు. ఇది కాకుండా రణస్థలం, పైడి బీమవరం మధ్య గల కోష్ట ప్రాంతంలో మరో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు మంత్రి ప్రకటించడంతో ప్రజల్లో మళ్లీ అణుకుంపటి రాజుకుంటోంది.
ప్రజల ఆవేదనను అర్థం చేసుకోవడం లేదు
అణు విద్యుత్ ప్లాంటు అంతకంటే పర్యావరణ ముప్పు వాటిల్లే ప్లాంటుగా ప్రపంచ దేశాలనుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో దేశానికి ఆహ్వానించి ప్రజల గుండెల మీద కుంపటి పెట్టడం దారుణం. మంత్రి మాటలు ప్రజల ఆవేదనను పట్టనట్టుగా ఉన్నాయి. ఉద్యమాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ముందుంటాం. -చౌదరి తేజేశ్వరరావు, సీపీఎం నేత
అంత మోజెందుకు?
అణువిద్యుత్ వల్ల పొంచి ఉన్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ప్రపంచదేశాలు వద్దనుకుం టున్నాయి. అలాంటి ప్రమాదాన్ని తెచ్చి శ్రీకాకుళం ప్రజల నెత్తిన పెట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్త్తున్నాయి. అందులో మంత్రి అచ్చెన్నాయుడు ప్రజల అభిమతాన్ని గౌరవించకుండా మరో అణు విద్యుత్ కేంద్రాన్ని ఇక్కడే నిర్మిస్తామని చెప్పడం గర్హనీయం. - భవిరి కృష్ణమూర్తి, సీపీఎం జిల్లా కార్యదర్శి