నిండా ముంచేశారు..
నిండా ముంచేశారు..
Published Thu, Oct 13 2016 9:26 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
* వెలుగు చూస్తున్న విత్తన నకి‘లీలలు’
* దారుణంగా మోసపోయిన రైతులు
* మొక్కలు తీసేసి మళ్లీ నాటుతున్న వైనం
* నష్టం ఎలా పూడుతుందని అన్నదాతల ఆందోళన
గుంటూరు రూరల్: మిర్చి నకి‘లీలలు’ రోజురోజుకూ మరిన్ని వెలుగు చూస్తున్నాయి. గుంటూరు రూరల్ మండలంలో మిర్చి వేసిన పలువురు రైతులు నిండా మునిగారు. విత్తనాలు నాటి మూడు నెలలు అయ్యాకా... మొక్క ఎదుగుదల , పూతలో పూర్తి స్థాయిలో మార్పులు గమనించి తాము నకిలీ విత్తనాలు వేశామని గ్రహించారు. చేసేదిలేక మిరపతోటలను పీకి అదే స్థానంలో కొత్త మొక్కలను మొక్క ఒకొక్కటి రూపాయి వంతున కొనుగోలు చేసి నాటుకుంటున్నారు. మండలంలోని పెదపలకలూరు, చిన్నపలకలూరు, దాసుపాలెం, మల్లవరం, తోకావారిపాలెం, పేరేచర్ల, మేడికొండూరు తదితర గ్రామాల్లో బ్రహ్మపుత్రా కంపెనీకి చెందిన 555 రకాన్ని కొనుగోలు చేసి విత్తుకున్న రైతులు దారుణంగా మోసపోయామంటున్నారు. విత్తనాలు విత్తుకునే నాటికే సొంత పొలం దారులు ఈ ఏడాది రూ 40 నుంచి 50 వేలను పెట్టుబడి పెట్టి నష్టపోగా, కౌలు రైతులు రూ 50 నుంచి 70 వేల వరకూ నష్టాలను చవిచూశారు.
200 ఎకరాల్లో మిర్చి మొక్కలను తీసేస్తున్న రైతులు..
నకిలీ విత్తనాలను విత్తుకుని నష్టపోయామని తెలిసి రైతులు మిర్చి మొక్కలను తీసేస్తున్నారు. మొత్తంగా 200 ఎకరాల్లో ఇదే పరిస్థితి. విత్తనాలను కొనుగోలు చేసిన దుకాణాల దారులను ప్రశ్నిస్తే తాము సంస్థలోనే కొనుగోలు చేశామని చెబుతున్నారని, తమ గోడు వినేవాడు లేకుండా పోయాడని అంటున్నారు. వేల రూపాయలు ఖర్చు చేశామని, నష్టం ఏవిధంగా పూడ్చుకోవాలో తెలియటంలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అదనపు ఖర్చుతో భారం...
మొక్కలను పీకేసినlస్థానంలో ప్రకాశం జిల్లా నుంచి కొత్త మొక్కలను కొనుగోలు చేసి నాటుతున్నారు. మొక్క ఒకటి రూపాయి ఖర్చవుతుందని, ఏకరాకు సుమారు రూ.1,600 నుంచి రూ.2 వేల వరకూ పడుతోందని, నష్టపోయిన దానికి ఈ ఖర్చు మరింత భారంగా మారిందని అంటున్నారు. నకిలీ విత్తనాలను విత్తుకుని నట్టేట మునిగామని చెప్పినా అటు వ్యవసాయ శాఖ అధికారులు గానీ, ప్రజాప్రతినిధులు కానీ తమను పట్టించుకోవటంలేదని, అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
ఈ ఏడాది నష్టాలే..
ఇప్పటికి మాగ్రామంలో దాదాపు 50 మందికి పైగా రైతులు 100ఎకరాల్లో మిర్చి తోటలోని మొక్కలను తొలగించారు. నేను మూడు ఎకరాల్లో మిర్చి సాగు చేశా. రెండు ఎకరాల్లో నకిలీ విత్తనాలు అని తేలటంతో తోటపై ఆశలు వదులుకున్నా. నారు కొనుగోలు చేసి మళ్లీ నాటుకోవాల్సి ఉంది. ఇప్పటికే రూ 70–80 వేల నష్టాన్ని చవి చూశా. అధికారులు పట్టించుకోకుంటే రైతులు
ఈ ఏడాది పూర్తిగా మునిగిపోవడం ఖాయం.
- చాతరాజుపల్లి శ్రీనివాసరావు, రైతు, దాసుపాలెం
Advertisement
Advertisement