మహిళా లోకం కన్నెర్ర
- ఎమ్మెల్యే రోజా పట్ల ప్రభుత్వ తీరుపై సర్వత్రా నిరసన
- త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక
- చంద్రబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్
కర్నూలు(అర్బన్): ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో, అక్కడ దేవతలు కొలువై ఉంటారనేది శాస్త్రం. అయితే మన రాష్ట్రంలో మాత్రం స్త్రీలకు కనీస గౌరవం కూడా దక్కడం లేదనేందుకు ఎమ్మెల్యే ఆర్‌కే రోజా పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు అద్దం పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మహిళా పార్లమెంటేరియన్ల సాధికార సదస్సుకు రోజాను ప్రభుత్వమే ఆహ్వానించి అవమానించిన ఘటనపై నారీ లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఓ ఫ్యాక‌్షనిస్టు, టెర్రరిస్టును అరెస్ట్ చేసిన విధంగా సదస్సు జరిగే ప్రాంగణంలోకి అడుగు పెడుతున్న ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొని ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పకుండా హైదరాబాద్‌కు తరలించడం భావ స్వేచ్ఛను హరించడమేనని మహిళలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలకు రక్షణ కరువైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చాలీచాలని జీతాలతో కడుపులు ఎలా నింపుకోవాలని అంగన్‌వాడీ కార్యకకర్తలు ధర్నాలు చేస్తే మహిళలనే కనీస విచక్షణ లేకుండా పోలీసులు లాఠీ ఝలిపించి పలువురిని గాయపరిచన ఘటన గతంలో కర్నూలులో చోటు చేసుకుంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు అనేకం చోటు చేసుకుంటున్నాయని, అడ్డుకోవాల్సిన పోలీసులే ప్రేక్షక పాత్ర వహించడంతో దాడులు పునరావృతం అవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మహిళల హక్కులను కాల రాస్తున్నారు
చంద్రబాబు రాష్ట్రంలో మహిళల హక్కులను కాల రాస్తున్నారు. మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు ఎమ్మెల్యే రోజాను ఆహ్వానించి, అవమానించడం దారుణం. మహిళా సాధికార సదస్సులో ఎవరి భావాలను వారు వ్యక్తపరిచే హక్కు ఉంది. రోజాను అనధికారికంగా అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తీసుకురావడంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. స్పీకర్ కోడెల శివప్రసాద్, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోద్బలంతోనే ఇదంతా జరిగింది.
– శౌరీలు విజయకుమారి, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు
చంద్రబాబు క్షమాపణ చెప్పాలి
ఒక మహిళ అని చూడకుండా ఎమ్మెల్యే రోజా పట్ల ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు బేషరతుగా రాష్ట్రంలోని మహిళలందరికి క్షమాపణ చెప్పాలి. రోజా పేరు వింటే చంద్రబాబుకు భయం పట్టుకుంది. వేదికపై మహిళా నేతల ఫొటోలు మచ్చుకైనా కనిపించకపోవడం పురుషాహంకార సమాజానికి నిదర్శనం.
– పట్నం రాజేశ్వరి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు
పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకుంటే సరి
రాష్ట్రంలో మహిళలను అవమానించడం చంద్రబాబు ప్రభుత్వానికి కొత్తేమి కాదు. అధికారంలో ఉన్నామనే అహంతో తాము ఏమి చేసినా చెల్లుతుందనుకోవడం భ్రమ. జాతీయ సదస్సుకు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి అతిథులను ఆహ్వానించిన ప్రభుత్వం మన రాష్ట్రానికి చెందిన మహిళా ప్రజా ప్రతినిధిని అవమానించడం క్షమించరాని విషయం. జరిగిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
– అలివేలమ్మ, ఐద్వా జిల్లా కార్యదర్శి
మహిళలు తిరగబడే రోజు వస్తుంది
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరు పట్ల మహిళలు తిరగబడే రోజు దగ్గర్లోనే ఉంది. ఒక మహిళా ఎమ్మెల్యేకే రక్షణ కరువైతే సామాన్యుల పరిస్థితి ఏంటి? మహిళలకు సంబంధించిన సదస్సుకు హాజరవుతున్న ఎమ్మెల్యే ఆర్‌కే రోజా తమ ప్రభుత్వ బండారాన్ని ఎక్కడ బయట పెడుతుందోననే భయంతోనే చంద్రబాబు పోలీసులను ఉసిగొలిపి అనధికారికంగా అరెస్ట్ చేయించారు. ఒక్క గొంతు నొక్కినంత మాత్రానా వాస్తవం ప్రజల్లోకి పోకుండా అడ్డుకోలేరు.
- నాగేశమ్మ, ఏపీ మహిళా సంఘం జిల్లా కార్యదర్శి