హత్య చేస్తామని బెదిరిస్తున్నారు
గ్రామానికి రక్షణ కల్పించండి
పోలీసులకు ఐదు గ్రామాల ప్రజల ఫిర్యాదు
రామసముద్రం: అడ్డకొండలో జరిగిన ఆదినారాయణ హత్య కేసు విషయమై కొందరు తమను హత్య చేస్తామని బెదిరిస్తున్నారని పెద్దకురప్పల్లె పంచాయతీకి చెందిన నారేవారిపల్లె, మనేవారిపల్లె, తప్పసానిపల్లె, బ్రాహ్మణపల్లె, మొటుకు గ్రామాల ప్రజలు వాపోయారు. వారు సోమవారం పోలీసుస్టేషన్‌కు చేరుకుని ఆందోళన చేపట్టారు. వారు మాట్లాడుతూ నారేవారిపల్లెకు చెందిన వెంకట్రమణ కుమారుడు ఆదినారాయణ గత నెల 20వ తేదీన నుంచి కనిపించలేదన్నారు. అడ్డకొండలో కాలిపోయిన శవంను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలిపారు. పుంగనూరు రూరల్ సీఐ రవీంద్ర, ఎస్‌ఐ సోమశేఖర్ పరిశీలించారని పేర్కొన్నారు. శవాన్ని చూసిన గ్రామస్తులు మృతుడు ఆదినారాయణగా గుర్తించారని చెప్పారు.
ఆదినారాయణ భార్య రత్నమ్మ, కుమారుడు అనిల్, ఎం.శ్రీనివాసులు, ఎం.రాజేష్, పి.రవికుమార్ ఆదినారాయణతో పాటు టమాట పంటకు నీరు పెట్టేందుకు వెళ్లారని, ఈ క్రమంలో తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య పథకం ప్రకారం ఆదినారాయణను హత్య చేసిందని తెలిపారు. ఈ కేసు విషయమై అదే గ్రామానికి చెందిన ఎం.లక్ష్మీపతి తమ్ముడు జనార్దన, రామచంద్ర, వాసు, వారి భార్యలు గ్రామస్తులను భయపెడుతున్నారని వాపోయారు. ఊరిలో ఎవరైనా ఆదినారాయణ హత్య కేసులో నోరు తెరిస్తే నాలుకలు కోస్తానని లక్ష్మీపతి బెదిరిస్తుŠాన్నడని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి పోలీసులు రక్షణ కల్పించాలని గ్రామస్తులు వేడుకున్నారు. ఆందోళన చేసిన వారిలో హరినాథ్, గుణశేఖర్, శ్రీనివాసులునాయుడు, ఎంపీటీసీ రెడ్డెప్పనాయుడు, రామాంజుల తదితర ఐదు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.