బాకీ తీర్చనందుకు కడతేర్చాలనుకున్నారు. పక్కా స్కెచ్‌తో హత్యకు కట్ర పన్నారు.
అనంతపురం సెంట్రల్ : బాకీ తీర్చనందుకు కడతేర్చాలనుకున్నారు. పక్కా స్కెచ్‌తో హత్యకు కట్ర పన్నారు. చివరకు వ్యూహం బెడిసి ముగ్గురు నిందితులు పోలీసుల వలకు చిక్కారు. ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలను అనంతపురం వన్‌టౌన్ సీఐ రాఘవన్ విలేకరులకు మంగళవారం తెలిపారు. అనంతపురంలోని మరువకొమ్మ కాలనీలో నివాసముంటున్న మొండి శ్రీనివాసులు పందుల పెంపకం వృత్తిగా జీవించేవాడు. నాయక్‌నగర్‌కు చెందిన వరుసకు అల్లుడైన మొండి వెంకటేశ్ నుంచి రూ.2 లక్షల దాకా అప్పు చేశాడు. ఈ విషయంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి.
అప్పు చెల్లించాలని వెంకటేశ్ ఒత్తిడి చేశాడు. అయితే డబ్బులు చెల్లించకుండా వాయిదాలు వేస్తూ వస్తున్న మొండి శ్రీనివాసులను ఎలాగైనా కడతేర్చాలని పథకం రచించాడు. తన స్నేహితులైన నాయక్‌నగర్‌కు చెందిన సాకే శ్రీనివాసులు, పిచ్చికుంట్ల నారాయణలతో కలసి మంగళవారం హత్యకు కుట్రపన్నారు. మొండి శ్రీనివాసులు ప్రతి రోజూ పందులు మేపుకోవడానికి వచ్చే భైరవనగర్‌లో మారణాయుధాలతో కాపుకాశారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ ఎస్‌ఐ వెంకటరమణ, తమ సిబ్బందితో వెళ్లి నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి మూడు వేటకొడవళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు పంపుతున్నట్లు తెలిపారు. హత్య కుట్రను భగ్నం చేసిన ఎస్‌ఐ వెంకటరమణ, హెడ్‌కానిస్టేబుళ్లు సూరి, రాజకుళ్లాయప్ప, కానిస్టేబుళ్లు నాగరాజు, చలపతి, రమేశ్, చిన్న చంద్రను అభినందిస్తూ రివార్డుకు సిఫార్సు చేశారు.