మూడు రోజులుగా శవా నికి వైద్యం
సాయిసత్య హాస్పిటల్‌లో వ్యక్తి మృతిపై వివాదం
– బంధువుల ఆందోళన
– రోగి కుటుంబీకులపై ఆసుపత్రి సిబ్బంది దాడి
– ఫర్నిచర్, కారు అద్దాలు ధ్వంసం
– కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం
కర్నూలు(హాస్పిటల్):
రోగి చనిపోయి మూడు రోజులైనా శవానికి కర్నూలులోని సాయిసత్య హాస్పిటల్‌లో వైద్యం చేయడం వివాదానికి దారితీసింది. రోగి బతికి ఉన్నాడని, చికిత్స చేస్తున్నామని చెబుతూ బకాయిపడ్డ మొత్తాన్ని వసూలు చేసుకుని, చివరికి చనిపోయాడని ప్రకటించారు. దీంతో రోగి కుటుంబీకులు ఆందోళనకు దిగి ఆసుపత్రిపై దాడి చేశారు. ఇదే సమయంలో వీరిపై ఆసుపత్రి సిబ్బంది దాడికి పాల్పడ్డారు. మృతుని కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా యాడికి మండలం పిన్నేపల్లి గ్రామానికి చెందిన రమణప్ప(52) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. గత నెల 22న ఆయన ఎద్దులు అమ్మేందుకు కర్నూలు జిల్లా డోన్‌కు వెళ్లాడు. తిరిగి ఆటోలో వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆటో బోల్తా పడి ఆయన కాలుపై పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించగా కర్నూలులోని సాయిసత్య హాస్పిటల్‌కు రెఫర్ చేశారు. ఎంఆర్‌ఐ, రక్తపరీక్షలన్నీ చేసి కాలుకు నాలుగు ఆపరేషన్లు చేయాల్సి ఉంటుందని, రూ.1.50లక్షలు ఖర్చు అవుతుందన్నారు. రోగి నెలరోజుల పాటు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుందని తెలిపారు. దీనికి సమ్మతించడంతో వైద్యులు ఆపరేషన్ చేశారు. ఈ నెల 11, 12వ తేదీల్లో ఆపరేషన్ చేసిన డాక్టర్ హరిప్రసాద్ ఊళ్లో లేరు. ఆ సమయంలో ఆసుపత్రి సిబ్బంది వైద్యం చేశారని రమణప్ప కుటుంబీకులు తెలిపారు. వారు నిర్లక్ష్యంగా వైద్యం చేయడం వల్లే కిడ్నీలు పాడయ్యాయని, ఈ కారణంగా వారం రోజుల నుంచి ఐసీయూలో ఉంచి డయాలసిస్ చేశారన్నారు. మూడు రోజుల క్రితమే ఓ డాక్టర్ వచ్చి రమణప్ప చనిపోయాడని చెప్పాడని, కానీ ఆసుపత్రి వైద్యులు మాత్రం బతికే ఉన్నాడని చెప్పి మోసపుచ్చారన్నారు. బుధవారం రాత్రి సైతం ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లి వైద్యం చేశారని, అర్ధరాత్రి దాటాక మరణించాడని ప్రకటించారన్నారు. రూ.1.50లక్షలు ఖర్చు అవుతుందని చెప్పి మాతో రూ.5లక్షల దాకా ఖర్చు పెట్టించారని ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే రమణప్ప చనిపోయాడని మేనల్లుడు లక్ష్మన్న విమర్శించారు.
ఆసుపత్రిలో ఘర్షణ
రమణప్ప మృతిపై బుధవారం రాత్రి నుంచి ఆసుపత్రి సిబ్బంది, రమణప్ప కుటుంబీకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో మృతుని కుటుంబీకులపై ఆసుపత్రి సిబ్బంది దాడి చేశారు. ఆగ్రహించిన రమణప్ప కుటుంబీకులు ఆసుపత్రి ఫర్నిచర్, వైద్యుని కారు టైర్లలో గాలి తీశారు. ఇదే సమయంలో ఓ వ్యక్తి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని, ఆసుపత్రిని సీజ్ చేయాలంటూ ఆందోళన చేశారు. శవాన్ని క్యాజువాలిటిలో ఉంచి ఆసుపత్రి ఎదుట బైఠాయించారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు మూడవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
షుగర్, టైఫాయిడ్ వల్లే మృతి
రమణప్పకు ముందు నుంచి షుగర్ ఉంది. దీనికి తోడు టైఫాయిడ్ వచ్చింది. ఈ రెండింటినీ కంట్రోల్ చేశాం. డిశ్చార్జ్ చేస్తే రెండు రోజులకు ఒకసారి డ్రెస్సింగ్‌కు రావాలంటే ఇబ్బందని, ఇక్కడే ఉంటామన్నారు. ఈ నేపథ్యంలో షుగర్ కంట్రోల్‌లో లేక గాయానికి ఇన్‌ఫెక‌్షన్ వచ్చి సెప్టిసీమియాగా మారింది. కిడ్నీలు ఫెయిల్ కావడం వల్ల ఐసీయూలో ఏడురోజుల పాటు ఉంచాం. బుధవారం రాత్రి అతనికి ఫిట్స్ కూడా వచ్చాయి. అది సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. చనిపోయిన వ్యక్తికి వైద్యం చేశామనడం వాస్తవం కాదు.
–డాక్టర్ హరిప్రసాద్, ఆసుపత్రి అధినేత