
బస్సును కారు ఢీ కొని ముగ్గురికి గాయాలు
ప్రొద్దుటూరు క్రైం: స్థానిక మోడంపల్లె బైపాస్ రోడ్డులో ముందు వెళ్తున్న బస్సును కారు ఢీ కొన్న సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఎర్రగుంట్లకు చెందిన రిటైర్డు ఎల్‌ఐసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ రామసుబ్బారెడ్డి, ఎల్‌ఐసీ ఏజెంట్లు సుదర్శన్, అబ్దుల్‌షరీఫ్‌లు కారులో గురువారం సాయంత్రం ఎర్రగుంట్ల నుంచి జమ్మలమడుగుకు బయలుదేరారు. ప్రొద్దుటూరులో కొంచెం పని ఉందని, చూసుకొని వెళ్దామని రామసుబ్బారెడ్డి బైపాస్‌రోడ్డు గుండా మైదుకూరు రోడ్డు వైపు కారు తిప్పాడు. అయితే బైపాస్‌రోడ్డులోని శ్రీ చైతన్య స్కూల్ సమీపంలోకి వెళ్లగానే ముందు వైపు పులివెందుల నుంచి ప్రొద్దుటూరుకు వెళ్తున్న ఏపీ04 టిటి 9988 నెంబర్ గల ఆర్టీసీ బస్సును వారి కారు ఢీ కొంది. బస్సును ఢీ కొనడంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కకు వెళ్లింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. డ్రైవింగ్ చేస్తున్న రామసుబ్బారెడ్డి తీవ్రంగా గాయ పడ్డారు. గాయపడిన వారిని వెంటనే 108 అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బస్సు కండక్టర్ బియ్యంశెట్టి వీరవెంకటప్రతాప్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చలపతి తెలిపారు.