ముగ్గురి బలవన్మరణం
హిందూపురం రూరల్ : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు బలవన్మరణం చెందారు. హిందూపురం రూరల్ మండలం బేవినహళ్లిలో మంజునాథ్(26) బుధవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్ఐ బాషా తెలిపారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జీవితంపై విరక్తితో ఉరేసుకుని తనువు చాలించినట్లు వివరించారు. ఇదే మండలం చౌళూరులో ఈడిగ నాగమ్మ(35) అనే వివాహిత కూడా బుధవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్ఐ బాషా తెలిపారు. కొంతకాలంగా మతిస్థిమితం లేని ఆమె ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెందినట్లు వివరించారు. ఈ మేరకు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నటు చెప్పారు.
మనస్తాపంతో వృద్ధురాలు..
బత్తలపల్లి (ధర్మవరం) : బత్తలపల్లి మండలం గంటాపురంలో చిన్న అప్పస్వామి భార్య పుల్లమ్మ(62) విషపు గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. కొంతకాలంగా చిన్న అప్పస్వామి అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యారు. పుల్లమ్మ కడుపునొప్పితో బాధపడుతోంది. వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారందరికీ పెళ్లిళ్లైపోయాయి. ఎవరికి వారు వేరుగా కాపురాలుంటున్నారు. ఈ పరిస్థితుల్లో అనారోగ్యంతో ఉన్న తమను ఆదరించే వారు లేరన్న మనస్తాపంతో ఆమె సోమవారం విషపు గులికలు మింగి సమీపంలోని అప్రాచెరువులో మృతి చెందింది. బుధవారం అటుగా వెళ్లిన గొర్రెల కాపర్లు గుర్తించి ఇచ్చిన సమాచారంతో ఎస్ఐ హారున్‌బాషా తమ సిబ్బందితో అక్కడికి వెళ్లి పరిశీలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.