సమావేశంలో పాల్గొన్న జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, సీపీ మహేందర్‌రెడ్డి
సాక్షి,సిటీబ్యూరో: బక్రీద్, వినాయక చవితి సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జీహెచ్‌ఎంసీ, పోలీసు విభాగాల ఉన్నతాధికారులు నిర్ణయించారు. వినాయక శోభాయాత్రకు ఆటంకాల్లేకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వచ్చే నెలలో గణేశ్ ఉత్సవాలు, బక్రీద్ పండుగలు జరుగునున్న నేపథ్యం బుధవారం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ డా.జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ, రెండు పండుగలు ఒకేసారి వస్తున్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులు సమష్టిగా కృషి చేయాలన్నారు.సంబంధిత అధికారులతో సర్కిళ్ల వారీగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమస్యలపై సత్వరమే స్పందించేందుకు వీలుగా ప్రత్యేక కమ్యూనికేషన్ వ్యవస్థను రూపొందించుకోవాలన్నారు. వినాయక మండపాల వద్ద పారిశుధ్య నిర్వహణకు వాలంటీర్లను ఏర్పాటు చేస్తామన్నారు. బక్రీద్ రోజున రోడ్లపై వ్యర్థాలను సేకరించేందుకు పెద్దసైజు ప్లాస్టిక్ బ్యాగులను వినియోగిస్తామన్నారు.