కలప అక్రమ రవాణాను అడ్డుకుంటాం.. | tightened Kalapa wood illegal transport, says forest officer | Sakshi
Sakshi News home page

కలప అక్రమ రవాణాను అడ్డుకుంటాం..

Sep 12 2016 1:52 AM | Updated on Oct 4 2018 6:03 PM

మహారాష్ట్ర అటవీశాఖ సమన్వయంతో కలప అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తామని ఆదిలాబాద్ సర్కిల్ కన్జర్వేటర్ టి.పి.తిమ్మారెడ్డి అన్నారు.

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: మహారాష్ట్ర అటవీశాఖ అధికారుల సమన్వయంతో కలప అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తామని అటవీ శాఖ ఆదిలాబాద్ సర్కిల్ కన్జర్వేటర్  టి.పి.తిమ్మారెడ్డి అన్నారు. ఆదిలాబాద్, మహారాష్ట్ర నుంచి ప్రముఖ నగరాలకు నిత్యం సాగుతున్న కలప స్మగ్లింగ్ తీరుపై ‘సాక్షి’ దినపత్రిక ప్రధాన సంచికలో ఆదివారం ‘ఈ బల్లకట్టు.. మాఫియా కనికట్టు’ అనే శీర్షికతో సమగ్ర కథనం ప్రచురితమైంది. అటవీశాఖ వర్గాల్లో ఈ కథనం కలకలం సృష్టించింది.

దీనికి స్పందించిన తిమ్మారెడ్డి త్వరలోనే మహారాష్ట్రలోని చంద్రపూర్, యావత్‌మాల్ అటవీ సర్కిళ్ల అటవీ శాఖ అధికారులతో బోర్డర్ ప్రొటెక్షన్ మీటింగ్ (సరిహద్దు అటవీ పరిరక్షణ సమావేశం) నిర్వహిస్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రాణహిత నదీ పరివాహక ప్రాంతం నుంచి జరుగుతున్న కలప అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. గతంతో పోల్చితే ఈ మధ్య కాలంలో కలప అక్రమ రవాణా చాలా మట్టుకు తగ్గుముఖం పట్టిందని అన్నారు.
 
బెల్లంపల్లిలో డీఎఫ్‌వోలతో సమావేశం..: జిల్లాలోని అటవీ శాఖ ఉన్నతాధికారులతో కన్జర్వేటర్ ఆదివారం బెల్లంపల్లిలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని టెరిటోరియల్ విభాగాల డీఎఫ్‌వోలు, కలప రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్‌వోలు కూడా ఈ ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. అటవీ శాఖ విభజన ప్రక్రియపై ప్రధానంగా చర్చించిన ఉన్నతాధికారులు ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ప్రత్యేకంగా చర్చించారు. కలప అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement