బాబూ.. హామీ నెరవేర్చవా..? | Tirupati everything Satyagraha struggle sevasamiti | Sakshi
Sakshi News home page

బాబూ.. హామీ నెరవేర్చవా..?

Published Mon, Feb 27 2017 10:24 PM | Last Updated on Mon, Jul 30 2018 7:57 PM

బాబూ.. హామీ నెరవేర్చవా..? - Sakshi

బాబూ.. హామీ నెరవేర్చవా..?

ముద్రగడ పద్మనాభానికి సంఘీ భావంగా జిల్లావ్యాప్తంగా దీక్షలు
తిరుపతిలో బలిజ సేవాసమితి సత్యాగ్రహ దీక్ష
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన మద్దతు


బలిజ, కాపులను బీసీ జాబితాలో చేర్చుతానని చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ ముద్రగడ పద్మనాభం చేపట్టిన దీక్షకు జిల్లావ్యాప్తంగా ఆదివారం మద్దతు దీక్షలు ప్రారంభమయ్యాయి. తిరుపతిలో బలిజ సేవాసమితి నాయకులు సత్యాగ్రహ దీక్షచేపట్టారు. వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర రెడ్డి దీక్షలో పాల్గొని మద్దతు తెలిపారు.

తిరుపతి మంగళం: 2014 ఎన్నికల సందర్భంగా బలిజ, కాపులను బీసీ జాబితాలో చేర్చుతానని ఇచ్చిన హామీని నెరవేర్చవా చంద్రబాబూ ? అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి ప్రశ్నించారు. తిరుపతి నాలుగుకాళ్ల మండపం వద్ద ఆదివారం రాష్ట్ర కాపు నాయకులు పోకల అశోక్‌కుమార్‌ ఆధ్వర్యంలో తిరుపతి బలిజసేవా సమితి నాయకులు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సదంర్భంగా భూమన కరుణాకరరెడ్డి దీక్షలో పాల్గొని వారికి మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా బలిజ, కాపులను బీసీలో చేర్చకుండా మోసగిస్తూనే ఉన్నారని మండిపడ్డారు. ‘ఏరు దాటాక తెప్ప తగలేసినట్టు’గా అధికారంలోకి రాగానే చంద్రబాబు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశాడన్నారు. బలిజ, కాపుల సంక్షేమం కోసం కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చేపట్టే ఉద్యమ, దీక్షలను పోలీసులను అడ్డుపెట్టుకుని అణగదొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బలిజ, కాపులకు న్యాయం జరిగేంతవరకు తన మద్దతు ఉంటుందన్నారు. దీనిపై చంద్రబాబు ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని భూమన స్పష్టం చేశారు. అనంతరం రాష్ట్ర కాపు నాయకులు పోకల అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ ఎన్నికలప్పుడు తాము అధికారంలోకి రాగానే బలిజ, కాపులను వెంటనే బీసీల్లో చేర్చుతానని, వారి అభ్యున్నతికి వెయ్యి కోట్లు నిధులు మంజూరు చేస్తానన్న చంద్రబాబు ఇప్పుడు ఆ హామీని ఎందుకు నెరవేర్చట్లేదని ప్రశ్నించారు.

తమకిచ్చిన హామీ సాధన కోసం తమ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఉద్యమాలు చేపడితే సీఎం ఎక్కడికక్కడ అణచి వేయిస్తున్నారన్నారు. తిరుపతి బలిజ సంఘం అధ్యక్షులు ముద్రనారాయణ మాట్లాడుతూ బలిజలను బీసీల్లో చేర్చడంలో చంద్రబాబు నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తున్నారని ఆరోపించారు. ఒక పక్క బలిజ, కాపులను బీసీలో చేర్చుతానని చెబుతూనే సీఎం చంద్రబాబు మరోపక్క బీసీలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో చంద్రబాబు నియంతలా పాలిస్తున్నారని దుయ్యబట్టారు. వెంటనే బలిజ, కాపులను బీసీల్లో చేర్చాలని, లేనిపక్షంలో ఉద్యమాలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బలిజ సేవా సమితి నాయకులు ముద్రనారాయణ, బాలిశెట్టి కిషోర్, బండ్లలక్ష్మీపతి, దినేష్‌రాయల్, శివ, బాలాజి, రామూర్తి, గుట్టా నాగరాజు రాయల్, ప్రసాద్‌రాయల్, కిషోర్, సంపత్, రామకృష్ణ, లతాదేవి, లక్ష్మీకాంతమ్మ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement