తాటాకు చప్పుళ్లకు ఉద్యమం ఆగదు
కాపు ఉద్యమనేత,మాజీ మంత్రి ముద్రగడ ధ్వజం
ఆమదాలవలస: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య విలువలను మంట కలిపిస్తూ హిట్లర్ పాలన చేస్తున్న సీఎం చంద్రబాబునాయుడు వల్ల ప్రజలంతా నరకయాతన అనుభవిస్తు న్నారని కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ధ్వజమెత్తారు. ఏపీ లోని శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం నివాసం లో బుధవారం ఆయన విలేకరులతో మాటా ్లడారు. కాపు జాతిది న్యాయ పోరాటమని, ముఖ్యమంత్రి పదే పదే తుని సంఘటనను చెబుతూ ఉద్యమకారులను భయపెట్టాలని చూస్తున్నారని, ఇలాంటి తాటాకు చప్పుళ్లకు ఉద్యమం ఆగదని తేల్చి చెప్పారు. తుని ఘటనలో రైలు తగలబెట్టిన వారిలో కాపు జాతికి చెందిన వారు లేరని, ఇది జగమెరిగిన సత్యమని చెప్పారు. ఒక వేళ ఉంటే ముఖ్యమంత్రి వారిపై చర్యలు చేపట్టాలని సవాల్ విసిరారు. రైతులను మోసం చేస్తున్న గజదొంగ చంద్రబాబు అని దుయ్యబట్టారు.
బాబు ఆటలు సాగవు
రాష్ట్రంలో కుల చిచ్చు రేపుతూ.. బీసీలను రెచ్చగొడుతూ రాష్ట్రంలో ప్రజల వినాశనానికి ప్రయత్నిస్తున్న చంద్రబాబు ఆటలు ఇక సాగవని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం హెచ్చరించారు. తమ జాతికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ముద్రగడ చేస్తున్న పోరాటానికి భయపడిన బాబు.. తుని ఘటనలో గుండాలతో రైళ్లు తగలబెట్టించారని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నట్లు ఎంతకాలం బతికావు అన్నది కాదు ఎలా బతికావు అన్నదే ముఖ్యం అన్న విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలని హితవు పలికారు.